మునుగోడు, జూలై 02 : కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని, ప్రధాని మోదీ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గం జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) మునుగోడు మండల జనరల్ బాడీ సమావేశం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వందేళ్ల క్రితం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మిక హక్కుల్ని కాల రాస్తున్నారని ఆరోపించారు.
78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజల రెక్కల కష్టంతో నిర్మితమైన ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అమ్ముతున్నారని విమర్శించారు. రైతులకు కనీస మద్దతు ధరల చట్టం, ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయడం, కార్మికుల కనీస వేతనం, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానం రద్దు ఇలాంటి 18 డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న ఈ పోరాటంలో కార్మిక వర్గం, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, యూనియన్ మండల నాయకులు ఎరగాని లింగయ్య, ఎర్ర అరుణ, రాజు అండాలు పెద్దమ్మ లక్ష్మయ్య, మండల కమిటీ సభ్యులు, యూనియన్ లీడర్స్ పాల్గొన్నారు.