ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ఉద్దేశించిన చెరువుల సుందరీకరణ పనులకు మోక్షం లభించడం లేదు. భువనగిరి మినీ ట్యాంక్ బండ్‌ను మరింత అభివృద్ధి చేయడంతోపాటు బీబీనగర్ చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా పట్టించుకోవడం లేదు. దాంతో రివర్ వ్యూ పార్కులు, వ్యూపాయింట్లు వంటి సుందీరకణ పనులు కలగానే మిగిలిపోయాయి.
బీఆర్ఎస్ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక ప్రపంచం అబ్బురపడేలా పునర్నిర్మించగా, స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో గుట్ట మార్గంలో ఉన్న భువనగిరి, బీబీనగర్ చెరువులను పర్యాటక కేంద్రాలను తీర్చిదిద్దాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. హైదరాబాద్ మహానగరానికి చేరువగా, వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకొని ఉండడంతో పర్యాటకులు, పట్టణ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావించింది. సుందీకరణ పనుల బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పగించింది. దాదాపు రూ.17 కోట్లతో భువనగిరి, బీబీనగర్ చెరువుల బ్యూటిఫికేషన్ చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో జంట నగరాలను కలిపే ట్యాంక్ బండ్ తరహాలో రెండు చెరువుల వద్ద పనులు చేపట్టాలని భావించింది. ఆ మేరకు అప్పటి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గతేడాది ఆగస్టులో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ-ప్రొక్యూర్ టెండర్లు కూడా ఆహ్వానించారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పనులు ఆగిపోయాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ భువనగిరి, బీబీనగర్ సుందీకరణ పనులు చేపడుతుందని అంతా భావించారు. కానీ, వచ్చి ఏడాది దాటినా పట్టించుకోవడం లేదు. తొలుత భువనగిరిలో కొంత మేర పనులు ప్రారంభమైనా ఆ తర్వాత ఆగిపోయాయి. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతోనే పనులు ముందుకు సాగడం లేదని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం బీబీనగర్ చెరువును ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ప్రస్తుతం ఉన్న నిధులు సరిపోవని చెప్తూ రెట్టింపు నిధులు తీసుకొస్తానని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ అడుగు ముందుకు పడలేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భువనగిరి చెరువు సుందరీకరణ పనులు చేపట్టాం. ఆ తర్వాత పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ నిధులు తీసుకొచ్చాం. అప్పటి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో పనులు పెండింగ్‌లో పడ్డాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సుందరీకరణ పనుల ఊసే ఎత్తడం లేదు. ఎమ్మెల్యే కుంభం చొరవ తీసుకుని పనులు చేయించాలి.
బీబీనగర్ చెరువు సుమారు కిలోమీటన్నర ఉంటుంది. నిత్యం నీళ్లు ఉండడంతో నిండుకుండలా కనిపిస్తుంది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చెరువు కట్టను బలోపేతం చేయాలని బీఆర్ఎస్ సర్కారులో భావించారు. చెరువు సుందరీకరణలో భాగంగా రూ.6కోట్లతో ఫ్లోరింగ్, రెయిలింగ్, గార్డెనింగ్, రెండు వైపులా ప్లాట్‌ఫారాలు, వాకింగ్ ట్రాక్, కుర్చీలు, టన్నెల్ తదితర పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. చెరువు పొడవునా హైమాస్ట్ లైటింగ్, చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కట్ట కింద చెరువు చుట్టూ 30 ఫీట్ల బీటీ రోడ్డు నిర్మించాలనుకున్నారు. ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా భువనగిరిలో ఉన్నట్లు ఎత్తయిన జాతీయ జెండా, లవ్ బీబీనగర్ సింబల్ ఏర్పాటు చేయాలని భావించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో అవేవీ అమలుకు నోచడం లేదు. ఇక భువనగిరి చెరువు కొంతమేర మినీ ట్యాంక్‌బండ్‌గా రూపుదిద్దినప్పటికీ పర్యాటకులను ఆకర్షించేందుకు మరో రూ.11కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. రివర్ వ్యూ పార్కులు, వ్యూ పాయింట్లు వంటి పనులు కలగానే మిగిలిపోయాయి.