– ఎంపీడీఓ, కార్యదర్శులు కుమ్మక్కై నిధులు డ్రా చేశారని ఆరోపణ
గుర్రంపోడు, మార్చి 26 : గుర్రంపోడు మండంలలోని పంచాయితీ కార్యదర్శులు, ఇన్చార్జి ఎంపీడీఓతో కుమ్మక్కై వారు ఖర్చు చేసిన నిధులను మాత్రం డ్రా చేసుకుని తమకు రావాల్సిన పెండింగ్ బిల్లుల చెల్లింపులో కొర్రీలు పెడుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ మండలంలోని మాజీ సర్పంచులు గురువారం ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎలాంటి నోట్ ఫైల్స్ లేకుండా పంచాయితీ కార్యదర్శులు వారు గతంలో చేసిన పనులకు సంబంధించి బిల్లులను పూర్తిగా డ్రా చేసుకుని తమకు రావాల్సిన ఎంబీ రికార్డు బిల్లులకు బిల్లులు చెల్లించడం లేదని వారు ఆరోపించారు. ఈ విషయమై ఇటీవల జిల్లా పంచాయితీ అధికారిని మండలంలోని మాజీ సర్పంచులు కలిసి బిల్లులు చెల్లించాలని కోరగా నూతన సర్పంచులతో సంబందం లేకుండా మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించాలని, అభ్యంతరం తెలిపి నిరాకరించిన ప్రస్తుత సర్పంచుల వివరాలు తమకు పంపితే వారి చెక్ పవర్ హోల్డ్ చేసి పాత బిల్లులు చెల్లించేలా ఆదేశాలు ఇస్తామని ఈ మేరకు ఇన్చార్జి ఎంపీడీఓకు సూచించినా ఇంతవరకు ఎంపీడీఓ వారికి నోటీసులు ఇవ్వకుంగా, బిల్లులు చెల్లించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నాడని ఆరోపించారు.
పరిసర మండలాల అన్నిచోట్ల 15వ ఆర్ధిక సంఘం నిధుల నుండి పెండింగ్ బిల్లులు ఇప్పటికే చెల్లించినా ఇక్కడ మాత్రం చెల్లించకుండా జాప్యం చేస్తున్న అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండలంలో 2023-24, 2024-25, 2025-26 సంవత్సరాలకు సంబందించి మండలంలోని మాజీ సర్పంచులకు రావాల్సిన రూ.1.70 కోట్ల బిల్లులతో పాటు, స్పెషల్ ఆఫీసర్ల కాలంలో చేసిన పనుల బిల్లులు కూడా రావాల్సి ఉందన్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని చందాన మాజీ సర్పంచులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇన్చార్జి ఎంపీడీఓపై చర్య తీసుకోవాలని కోరారు. కార్యదర్శుల బిల్లులకు లేని ప్రస్తుత సర్పంచ్ సంతకంతో కూడిన నోట్ ఫైల్ నిబంధన మాజీ సర్పంచులకు మాత్రం నోట్ ఫైల్ కావాలనడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పంచాయితీ కార్యదర్శులు ప్రస్తుత సర్పంచుల మెప్పుకోసం వారి బిల్లులు మాత్రం డ్రా చేసుకుని మాజీ సర్పంచ్ బిల్లుల విషయంలో కోర్రీల పెడుతున్న విషయంలో ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ విషయమై ఇన్చార్జి ఎంపీడీఓ అంజనేయులును ప్రశ్నించగా నోట్ ఫైల్ లేకుండా బిల్లులు ఎవరికీ ఇవ్వలేదని, పాత బిల్లుల చెల్లింపులకు సంబందించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవహరిస్తామని తెలిపారు. నోట్ ఫైల్ లేకుండా కార్యదర్శులకు బిల్లులు చెల్లింపులు జరిగిన విషయమై జిల్లా కలెక్టర్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేస్తామన్నారు. ధర్నాలో మాజీ సర్పంచులు షేక్ మస్రత్ సయ్యద్‌మియా, తిరుగుడు జ్యోతి లింగారెడ్డి, ఎరుకల రేణుశ్రీ రామలింగం, బొమ్ము బాలమల్లయ్య, ఎనమల్ల కృష్ణ ప్రసాద్, మర్రి అనితా సైదులు, కామెల్ల రేవతి నర్సింహ్మ, కంచర్ల జగదీశ్వర్‌రెడ్డి, చనమల్ల రజితా ప్రతాప్‌రెడ్డి, పాల్వయి కరుణ శ్రీనయ్య, బద్రి యాదయ్య, కట్టెబోయిన విజయ్, కేసాని యాదగిరి రెడ్డి, బొల్లు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వీరికి మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య సంఘీభావం తెలిపారు.