కోదాడ రూరల్, జూలై25 : మండల పరిధి గుడిబండ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ చింతా కవితారెడ్డి ఇంటిపై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. ఇంటి గేటును విరగొట్టి, ఇంట్లోని సామగ్రిని చిందరవందర చేశారు. విషయం తెలిసిన ఎంపీపీ బంధువులు, స్నేహితులు దుండగులను బయటకు వెళ్ల గొట్టారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఈ సందర్బంగా కవితారెడ్డి తన భూమి, ఇంటికి సంబంధించిన పత్రాలను రూరల్ సీఐ రజితారెడ్డికి చూపుతూ తనపై వ్యక్తి గత కక్షతో గ్రామానికి చెందిన కొంత మంది తన ఇంటిపై దాడులు చేయిస్తున్నారని ఈ విషయాన్ని ముందు జిల్లా పోలీసు అధికారికి విన్నవించుకున్నట్లు తెలిపారు. కోర్టు పరిధి ఉన్న ఇంట్లో ఎవరూ ఉండరాదంటూ పోలీసులు ఇరువర్గాల వారిని బయటకు పంపి తాళం వేశారు. అనంతరం కవితారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే గ్రామానికి చెందిన కొందరు అదికార పార్టీ నాయకులు తన ఇంటిపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.
సర్వే నెంబర్ 452లోని మూడెకరాల రెండు కుంటల భూమి 1971 నుంచి తన మామ చింతా చంద్రారెడ్డి స్వాధీనంలో ఉన్నదన్నారు. ఆ స్థలంలో 2016 – 17లో పంచాయతీ అనుమతితో ఇల్లు నిర్మించామన్నారు. గతంలో ఒకసారి 452 సర్వే నెంబర్లో ఎకరం 9 కుంటల భూమి తమకు ఉన్నదంటూ గ్రామానికి చెందిన కొందరు ఘర్షణకు దిగడంతో రెవెన్యూ అధికారులతో సర్వే చేయించామన్నారు. వారు పూర్తి స్థాయిలో సర్వే చేసి ఆ భూమి చింతా చంద్రారెడ్డికి చెందినదేనంటూ సరైన పత్రాలు అందజేశారన్నారు. అయినప్పటికీ తప్పుడు పత్రాలు సృష్టించి తమపై దాడులకు పాల్పడేందుకు కొందరిని ఉసికొల్పుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరైన పత్రాలు ఉంటే కోర్టులో తెల్చుకోవాలే కానీ, ఇలా దౌర్జన్యాలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
మాజీ ఎంపీపీ చింతా కవితారెడ్డి బలమైన రాజకీయ శక్తిగా ఎదగడాన్ని జీర్ణించుకోలేక గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు దాడులను ప్రోత్సహిస్తున్నారని వారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. అనంతరం గుడిబండలో దాడికి గురైన మాజీ ఎంపీపీ ఇంటిని ఆయన గురువారం పరిశీలించారు.