నేరేడుచర్ల, జనవరి 20 : దేశానికి అన్నంపెట్టే రైతులను మోసం చేస్తూ, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాయ మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతున్నదని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నేరేడుచర్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్యయ కర్త ఒంటెద్దు నర్సింహారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిన మాయ మాటలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు గోసపడుతున్నారని అన్నారు. అమలు కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 408 రోజుల పాలనలో 402 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇదే రైతు వ్యతిరేక పాలనకు నిదర్శనమని చెప్పారు. కనీసం 50శాతం రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఎరువుల కోసం చెప్పులు క్యూలో పెట్టిన సంఘటనలు తిరిగి కాంగ్రెస్ పాలనలో పునరావృతం అవుతున్నాయని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న, ప్రతి పక్షంలో ఉన్న ఎప్పుడూ ప్రజాపక్షమేనని తెలిపారు. బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకరవ్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి మాట్లాడుతూ రా్రష్ట్రంలో ప్రజాపాలన అని కాంగ్రెస్ గొప్పులు చెప్పుకుంటున్నదని, కానీ ప్రజా వ్యతిరేకపాలన సాగుతున్నదని అన్నారు. ఎన్నికల సమయంలో వరంగల్ డిక్లరేషన్‌లో చేసిన హామీలను తుంగలో తొక్కారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పెద్ద దొంగ అని, నిత్యం అబద్ధాలు చెప్పుతూ ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం మాత్రం సింగపూర్‌లో జల్సా చేస్తున్నాడని అన్నారు. కనీసం మరణించిన రైతులకు రైతు బీమా పధకం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మంత్రి వర్గంలో సఖ్యత లేదని, ఎవరికి అందిన కాడికి వారు దోచుకుంటున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికే 33సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చాడని, సీఎం కుర్చీ ఉండాలంటే ప్రతి నెలా రూ. 300 కోట్లు కాంగ్రెస్ అధిష్టానానికి ఇవ్వాలని ఆరోపించారు. సమావేశంలో నేరేడుచర్ల, పాలకవీడు బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు అరిబండి సురేశ్‌బాబు, కిష్టపాటి అంజిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు నాగండ్ల శ్రీధర్, కడియం వెంకటరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, పట్టణ, మండల ప్రధాన కార్యదర్శులు చిత్తలూరి సైదులు, ఎల్లబోయిన లింగయ్య, నాయకులు పిచ్చిరెడ్డి, వైఎల్ఆర్, రాపోలు నవీన్‌కుమార్, ఇంజమూరి రాజేశ్, అనంతు శ్రీనివాస్, సుదర్శన్, హుస్సేన్, బొడ్డుపల్లి సుందరయ్య, మర్రు శ్రీనివాస్, లకుమళ్ల రవీందర్ పాల్గొన్నారు.