తిరుమలగిరి(సాగర్)/పెద్దవూర, ఫిబ్రవరి 11 : రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్‌కుమార్, జాజుల నరేందర్ అన్నారు. ఆదివారం తిరుమలగిరి(సాగర్), పెద్దవూర మండల కేంద్రాల్లో వారు బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయాలంటే సంవత్సరానికి రూ.1.50లక్షల కోట్లు అవసరమని, కానీ బడ్జెట్లో రూ.53వేల కోట్లు మాత్రమే కేటాయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కృష్ణాజలాల వాటాను తేల్చకుండా పది సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నాన్చిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పిందని మండిపడ్డారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు వెళ్తే రైతులు, ప్రజలు నష్టపోతారని తెలిపారు. నెల్లికల్ లిఫ్ట్‌తోపాటు వివిధ పెండింగ్ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయని చెప్పారు. నాగార్జునసాగర్ ప్రస్తుత ఎమ్మెల్యే రబ్బర్ స్టాంప్ అని, జానారెడ్డి ఏది చెప్తే అది చేయాల్సిందేనని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయన్నారు. ఈ నెల 13న నల్లగొండలో కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ట్రైకార్ మాజీ ఛైర్మన్ ఇస్లావత్ రామచందర్‌నాయక్, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కడారి అంజయ్యయాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు పిడిగం నాగయ్య, జటావత్ రవినాయక్, నాయకులు బాబూరావునాయక్, భిక్షానాయక్, అల్లి పెద్దిరాజు, నాగెండ్ల వెంకట్‌రెడ్డి, గజ్జెల శ్రీనివాస్‌రెడ్డి, అంతయ్యయాదవ్, నడ్డి లింగయ్య, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.