హాలియా, ఫిబ్రవరి 8 : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్‌కుమార్, జాజుల సరేందర్ అన్నారు. బహిరంగ సభ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్‌తో కలిసి హాలియాలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీ పరిధిలోకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 13న నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం బీఆర్ఎస్ పార్టీ 14 ఏండ్లు పోరాటం చేసి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సాధించిందన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేండ్లు సుపరిపాలన అందించారని తెలిపారు. మోసపూరిత వాగ్దానాలతో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెప్ పార్టీ రైతులను వంచించడంతోపాటు స్వార్థ ప్రయోజనాల కోసం సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టడం బాధాకరం అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకునేందుకు ప్రయత్నించినా కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లొంగకుండా రాష్ట్ర రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేసిందని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకునేందుకు అంగీకరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సంతకం చేయడం సిగ్గుచేటన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ ఆయన మినిట్స్ బుక్ చదువకుండా కేఆర్ఎంబీ సమావేశంలో సంతకం పెట్టి రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలపై దెబ్బకొట్టినట్లు ఆరోపించారు.
ప్రాజెక్టులపై అధికారాన్ని కేఆర్ఎంబీకి కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని రైతులను కోరారు. అనంతరం బహిరంగ సభ పోస్టర్‌ను విడుదల చేశారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ, ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, రవినాయక్, పిడిగం నాగయ్య, తాటి సత్యపాల్, పగిళ్ల సైదులు, నాయకులు పాల్గొన్నారు.