దామరచర్ల/పాలకవీడు, జనవరి 18 : దామరచర్ల మండలంలోని పెన్నా సిమెంటు పరిశ్రమ ఉత్పత్తి సామర్థ్ధ్యాన్ని పెంచుకునేందుకు జిల్లా పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ నిర్బంధాల మధ్య కొనసాగింది. ఇప్పటికే పలువురు ఆందోళనలు, నిరసనలు చేపట్టడం, కోర్టులను ఆశ్రయించడం తెలిసిందే. ఈ క్రమంలో వ్యతిరేకంగా ఉన్నవారిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని, ఎలాంటి వ్యతిరేకతా కనిపించకుండా మ.మ. అనిపించారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
నల్లగొండ జిల్లా గణేశ్పాడు, సూర్యాపేట జిల్లా శూన్యంపాడు గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన పెన్నా సిమెంటు కర్మాగారాన్ని ఆదానీ సంస్థ ఇటీవల కొనుగోలు చేసింది. గతంలో పెన్నా సిమెంటు కర్మాగారం కింద 354.236 హెక్టార్లు మైనింగ్ లీజు ఉండగా, అందులో గణేశ్‌పాడులో 303,664 హెక్టార్లు, సూర్యాపేట జిల్లా శూన్యంపాడులో 50.572 హెక్టార్లలో ఉత్పత్తి సామర్ధ్యాన్ని 1.5 ఎంటీపీఏ నుంచి 1.8కి పెంచుకునేందుకు రెండు జిల్లాలకు వేర్వేరుగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణలో పలువురు ఎన్జీఓలు, స్థానికులు మాట్లాడుతూ మైనింగ్ వల్ల సమీపంలోని మూసీ నది కాలుష్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాలు కల్పించాలని, తండాల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. మైనింగ్ వల తమ ఇండ్లు దెబ్బతింటున్నాయని, సరైన రక్షణ చర్యలతో మైనింగ్ చేయాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన రైతులకు బహిరంగ మార్కెట్ కంటే అదనపు ధరను చెల్లించాలని కోరారు.
గతంలో పెన్నా సిమెంటు కర్మాగారం యాజమాన్యం అనేక హామీలు ఇచ్చి పట్టించుకోలేదని, పరిసర గ్రామాల ప్రజలు కాలుష్యం కారణంగా అనారోగ్యం పాలయ్యారని, పంటలు నష్టపోయామని వాపోయారు. అలాంటి పద్ధతులు అవలంబిస్తే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. దామరచర్ల మండలంలోని గణేశ్‌పాడులో మైనింగ్‌కు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో పలువురు లిఖితపూర్వకంగా, కొందరు నేరుగా అభిప్రాయాలను తెలిపినట్లు జేసీ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో వెంట నల్లగొండ జిల్లా పర్యావరణ ఈఈ విజయలక్ష్మీ, సబ్ కలెక్టర్ అమిత్నారాయణ్, సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సంగీత, హుజూర్నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, సీఐ చరమందరాజు ఉన్నారు.
ముందస్తు అరెస్టులు..
ప్రజాభిప్రాయ సేకరణకు రాకుండా పోలీసులు దామరచర్ల మండలంలోని బీఆర్ఎస్, సీపీఎం నాయకులు, సామాజికవేత్తలను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రజాభిప్రాయ సేకరణ ముగిశాక వారిని విడుదల చేసింది. బీఆర్ఎస్ నాయకులు సచిన్, వినోద్‌నాయక్, సేవాలాల్ జిల్లా అధ్యక్షుడు ధనావత్ ప్రకాశ్‌నాయక్, సీపీఎం నాయకులు వినోద్‌నాయక్, దయానంద్, సామాజిక వేత్త నక్కా శ్రీనును అదుపులోకి తీసుకుని ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లగచర్ల ఘటన దృష్ట్యా ముందస్తుగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్‌లు వందలాది పోలీసులు దామరచర్ల నుంచి గణేశ్పాడు, శూన్నంపాడులో బందోబస్తు విధుల్లో ఉన్నారు.
సీఎస్ఆర్ నిధులు స్థానిక గ్రామాలకే ఇవ్వాలి : ఎమ్మెల్యే బీఎల్ఆర్
పెన్నా పరిశ్రమ నుంచి వచ్చే సీఎస్ఆర్ నిధులను స్థానిక మండలం లో, ప్రభావిత గ్రామాలకే ఇవ్వాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. ఆ మంత్రి చెప్పిండు.. ఆ నాయకులు చెప్పారంటూ అని ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఊరుకునేది లేదన్నారు. కర్మాగారంలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నట్లు తెలిసిందని, ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు.
మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల, చిరుమర్తి హౌస్ అరెస్టు
దామరచర్ల మండలంలో పెన్నా సిమెంట్‌పై చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటారనే నెపంతో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను శనివారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నల్లగొండ టూటౌన్ఎస్ఐ రావుల నాగరాజు అధ్వర్యంలో కంచర్లను గృహ నిర్బంధం చేశారు. ఉదయం నుంచే ఆయన ఇంటి వద్ద పెద్దఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. మాజీ ఎమ్మెల్యే కంచర్ల వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మెరుగు గోపి ఉన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను నార్కట్‌పల్లిలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో చిరుమర్తి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్బంధకాండను దునుమాడారు. అరెస్టులతో ప్రశ్నించే గొంతుకను నొక్కలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా పెడుతున్న కేసులకు భయపడేది లేదని, వాతావరణాన్ని నాశనం చేసే పరిశ్రమలను పెట్టనివ్వబోమని తెలిపారు.
కోర్టు చెప్పినా నిర్బంధించారు
పెన్నా సిమెంటు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనకుండా పోలీసులు నన్ను ముందే అరెస్ట్ చేసి పాలకవీడు స్టేషన్‌కు తరలించారు. సమావేశం పూర్తి అయిన తర్వాత వదిలేశారు. ఇది అన్యాయం. పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యం వల్ల పంటలు నష్టపోతున్నాం. రోగాల పాలవుతున్నాం. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మాకు నష్టం చేస్తున్న ఈ పరిశ్రమకు మైనింగ్ లీజు నిలిపివేయాలంటూ హైకోర్టుకు కూడా వెళ్లాం. ప్రజాభిప్రాయ సేకరణ చేసుకోవచ్చని, కానీ పిటిషనర్ చేస్తున్న అభియోగాలను నివృత్తి చేయాలని కోర్టు చెప్పినా.. నన్ను ముందుగానే అరెస్ట్ చేయడం బాధాకరం.
-నక్కా శ్రీను, శూన్యంపాడు సామాజికవేత్త
గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
గతంలో పెన్నా సిమెంటు మా తండాకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. ఆ కర్మాగారం కింద మా భూమి పోయింది. అయినా మాకు ఉద్యోగం ఇవ్వలేదు. గణేశ్పాడు నుంచి శూన్యంపాడు వెళ్లే రహదారికి ఇరువైపులా మైనింగ్ ఏర్పాటు చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది.
– లక్ష్మణ్‌నాయక్.. గణేశ్పాడు