రాజాపేట, మే 7 : రెండున్నరేండ్ల్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేవలం ఫొటోలకు పోజులిస్తూ కాలం గడుపుతున్నారని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి ఆరోపించారు. గురువారం రాజాపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సమయం లో ప్రజలకు భారీగా హామీలు ఇచ్చిన ఎమ్మెల్యే, వాటి అమలులో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని, సమస్యల పరిషారంపై చిత్తశుద్ధి లేదన్నారు. రాజాపేట మండలానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం 15వ ప్యాకేజీ కింద కాల్వల పనులు సగం వరకు పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చి, రెండున్నరేండ్లు గడిచినా ఒక అడుగు ముందుకు పడలేదని మండిపడ్డారు.
ఎమ్మెల్యే అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించకపోవడం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడం వల్ల రైతులు రోజుల తరబడి ధాన్యం అమ్ముకోకుండా ఎదురు చూడాల్సి వస్తోందన్నారు. రైతు సమస్యల పరిషారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గొంగిడి సునీతామహేందర్ రెడ్డి విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, పీఏసీఎస్ చైర్మన్ చింతలపూరి భాసర్ రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ సందిళ్ల భాసర్ గౌడ్, గుంటి మధుసూదన్ రెడ్డి, చింతల పూరి వెంకట్రాంరెడ్డి, ఎర్ర గోగుల జశ్వంత్, ఎడ్ల నరేశ్ రెడ్డి, సర్పంచ్లు చింతల సంపత్, బొడ్డు భాసర్, గోపిరెడ్డి, నరేశ్ష్ రెడ్డి, మోతుపల్లి బాలకృష్ణ, దగ్గుల విష్ణు తదితరులు ఉన్నారు.