చందంపేట(దేవరకొండ), ఫిబ్రవరి 10 : శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడం వల్ల నల్లగొండకు తీవ్ర నష్టం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత జరిగిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ విమర్శించారు. దేవరకొండలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన చలో నల్లగొండ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
కృష్ణా జలాల పంపిణీని కేఆర్ఎంబీకి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించడం వల్ల ఎడమకాల్వ రైతాంగం మళ్లీ తిరోగమనం అయ్యేలా పరిస్థితి వచ్చిందని వాపోయారు. 2021లో కేంద్రం గెజిట్ ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పగించేందుకు ఒప్పుకోలేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లుగా కేసీఆర్ ప్రాజెక్టులను కాపాడుకుంటూ వచ్చారని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలలు గడువక ముందే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఎవరో దీనితోనే స్పష్టమవుతున్నదని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం మేధావులు మౌనం వీడాలని, ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకోవాలని రవీంద్ర కుమార్ కోరారు. బోర్డు అనుమతి లేనిదే రాష్ట్ర ఇంజినీర్లు, అధికారులు ప్రాజెక్టు వద్దకు వెళ్లే పరిస్థితి ఉండదని తెలిపారు. బోర్డు అనుమతి లేనిదే విద్యుత్ చేయడం సాధ్యం కాదన్నారు. చలో నల్లగొండ సభకు నియోజక వర్గం నుంచి పదివేల మందికి పైగా బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లనున్నట్లు తెలిపారు. సమావేశంలో బహిరంగ సభ ఇన్చార్జి పన్యాల భూపతిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యానాయక్ వడిత్యా రమేశ్, హన్మంత్ వెంకటేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు ముక్కమళ్ల బాలయ్య, తూం నాగార్జున్‌రెడ్డి, మాధవరం శ్రీనివాస్‌రావు,
జడ్పీటీసీ సలహాదారులు మారుపాకుల సురేశ్ గౌడ్, బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు టీవీఎన్‌రెడ్డి, దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, ముత్యాల సర్వయ్య, లోకసాని తిరుపతయ్య, వెల్గూరి వల్లపురెడ్డి, రాజినేని వెంకటేశ్వర్రావు, ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్, ఏర్పుల గోవింద్ యాదవ్, దొందేటి మల్లారెడ్డి, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, గోపిడి కృష్ణారెడ్డి, యాసాని రాజవర్ధన్‌రెడ్డి, మాస భాస్కర్, రమావత్ మోహన కృష్ణ, ఉజ్జిని నరేందర్‌రావు, పేర్వాల జంగారెడ్డి, మాధవరం జనార్దన్‌రావు, రమావత్ రమేశ్, ఆరెకంటి రాములు, మునగాల అంజిరెడ్డి, రేటినేని ముత్యపురావు, కేతావత్ శంకర్ నాయక్, గోసుల అనంతగిరి, భగవంతరావు, వేముల రాజు, ఎర్రకృష్ణ, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.