నందికొండ, ఏప్రిల్ 2 : నందికొండ హిల్‌కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ నివాసం ఉంటున్న ఈఈ 19 నంబరు గల ఎన్నెస్పీ ఇంటిని రెవెన్యూ, పోలీస్, ఎన్నెస్పీ అధికారులు సంయుక్తంగా కలిసి మంగళవారం సీజ్ చేశారు. ఇంట్లోని సామగ్రిని మున్సిపల్ సిబ్బంది సహాయంతో ఎన్నెస్పీ అధికారులు ఎన్నెస్పీ స్టోర్ రూమ్‌లకు తరలించారు. దీనిపై ఎన్నెస్పీ ఈఈ మల్లికార్జునను వివరణ కోరగా ఎన్నెస్పీకి చెందిన ఈఈ 19 నివాస గృహాన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పేరు మీద అలాట్మెంట్ చేశారని, ఎమ్మెల్యే మారడంతో ఆ ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కు పలుమార్లు నోటీసులు ఇచ్చామన్నారు. దానికి ఆయన స్పందించకపోవడంతో కలెక్టర్ ఆధేశాలనుసారం ఇంటిని సీజ్ చేశామని తెలిపారు.
బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలు
నందికొండలోని బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి, వారి అనుచరులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. ఇటీవల నందికొండ మున్సిపాలిటీ చైర్పర్సన్ నివాస గృహాన్ని ఖాళీ చేయించగా, నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ యువజన నాయకుడు రాహుల్ సోదరుడి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న నివాస గృహాన్ని జేసీబీలతో నేల మట్టం చేశారని తెలిపారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ నివాసం గృహాన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సాకుతో దౌర్జన్యంగా, ఎటువంటి సమాచారం లేకుం డా ఇంట్లో సామగ్రిని బయటకు తీసి ఇంటిని సీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భగత్‌ను అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత
నందికొండలో తన ఇంటిని సీజ్ చేసిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే భగత్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయల్దేరారు. తన వాహనంలో హాలియా మీదుగా నాగార్జున సాగర్ వెళ్తుండగా హాలియా మండలం అలీనగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నందికొండకు వెళ్లేందుకు వీలు లేదని పోలీసులు తేల్చి చెప్పడంతో వాగ్వాదం చోటుచేసుకున్నది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడికి పెద్ద సంఖ్యలో రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఈ సందర్భంగా భగత్ మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన ఇంటిని సీజ్ చేశారని అన్నారు. తనకు ఎన్నెస్పీ అధికారుల నుంచి ఎటువంటి సమాచారమూ లేదని, తమ ఇంట్లో సామాన్లను తొలగించి ఇంటిని సీజ్ చేసిన అధికారులు, వారిని ప్రోత్సహించిన వారిపై న్యాయపరమైన పోరాటం చేస్తానని తెలిపారు. ఎన్నెస్పీ క్వార్టర్స్‌లో నివాసం ఉండేందుకు మాజీ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డికి ఎంత హక్కు ఉందో తనకు కూడా అంతే హక్కు ఉందని చెప్పారు. అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలే తప్ప అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి పనిచేయడం సరికాదని సూచించారు.