యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : బీజేపీ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండటంలేదు. అబద్ధాలు, మోసాలకు చిరునామాగా మారిపోయింది. ఏ మాత్రం సందు దొరికినా ఇతర పార్టీల నేతలను కొనేందుకు వెనుకాడడం లేదు. ఇలాగే మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఏకంగా రూ.18వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి బీజేపీలో చేర్చుకున్నది. ఈ విషయాన్ని రాజగోపాల్‌రెడ్డే స్వయంగా ఒప్పుకొన్నారు. ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు బేరసారాలకు దిగింది. ఒక్కొక్కరికి వంద కోట్లు ఇచ్చేందుకు ప్రలోభ పెట్టింది. కానీ ఆత్మాభిమానం అమ్ముకోలేక, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని వదులుకోలేక బేరసారాల కుట్రను భగ్నం చేశారు.
బీజేపీకి దెబ్బ మీద దెబ్బ
ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి దెబ్బ మీద దెబ్బ పడినట్లయ్యింది. ఇప్పటికే ఇటీవల బీజేపీ తీరు, దుర్మార్గపు నిర్ణయాలతో కీలక నేతలంతా బీజేపీ నుంచి బయటకు వస్తున్నారు. టీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారు. ఇటీవల బూడిద భిక్షమయ్య, రాపోలు ఆనందభాస్కర్, దాసోజు శ్రవణ్ గులాబీ గూటికి చేరిన విషయం తెలిసిందే. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నేతలంతా రాజీనామా చేసి టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతున్నది. పార్టీలో కొత్త, పాత నేతల మధ్య పంచాయితీ కొనసాగుతూనే ఉంది.
బైపోల్‌పై తీవ్ర ప్రభావం..
బీజేపీ బేరసారాలు మునుగోడు ఉప ఎన్నికపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ఉంటంకిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళ్తున్నది. మరో వారంలోనే పోలింగ్ జరుగనుంది. బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో ఓటర్ల మనోగతం మారనున్నది. ఇప్పటికే న్యూట్రల్‌గా ఉన్న ఓటర్లు బీజేపీని ఛీకొట్టనున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలువనున్నారు. అంతిమంగా బీజేపీ మూడో స్థానం నుంచి కూడా పడిపోనున్నట్లు చర్చ మొదలైంది.
ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగతరు..?
ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాయంత్రం నుంచి టీవీల్లో, సోషల్ మీడియాలో ఇదే వార్త హల్చల్ చేయడంతో అందరూ దీనిపైనే చర్చించుకున్నారు. ఏ ఇద్దరు కలిసినా బీజేపీ ప్రలోభాలపైనే మాట్లాడుకున్నారు. కాషాయ పార్టీని ఛీకొడుతున్నారు. ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం వస్తారని ప్రశ్నిస్తున్నారు. సిద్ధాంతం గల పార్టీ అని చెప్పుకొనే కమలం పార్టీకి ఇదేం పోయే కాలమని మండిపడ్డారు. ఇతర రాష్ర్టాల్లోనూ అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన పార్టీలను పడగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తీరును నిరసిస్తూ మునుగోడు, చౌటుప్పల్ మండల కేంద్రాల్లో బుధవారం రాత్రి టీఆర్ఎస్ శ్రేణులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
నిరాశలో కాషాయ శ్రేణులు..
బీజేపీ భారీ కుట్రతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. పార్టీ తరఫున ఒకాల్తా పుచ్చుకొని ప్రచారం చేస్తున్న కార్యకర్తలు ఒక్కసారిగా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. అందరి ముఖాలు నీరుగారిపోయాయి. రేప్పొద్దున ఏ ముఖం పెట్టుకుని బయట తిరుగాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు ఎలా అడుగాలని, ప్రచారానికి ఎలా వెళ్లాలని రగిలిపోతున్నారు. నాయకులు సైతం ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎంత డబ్బు ఆశ చూపినా లొంగకపోవడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఇదేనని చెప్పుకొస్తున్నారు.
నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
బీజేపీ కుట్రను నిరసిస్తూ గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. గ్రామగ్రామాన బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు పేర్కొన్నారు. కాషాయ పార్టీది అనాలోచిత చర్య అని మండిపడ్డారు. దీన్ని ప్రజాస్వామ్య వాదలంతా ఖండించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి బీజేపీకి మునుగోడు ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబుతారని చెప్పారు.
– రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్