నల్లగొండ, జూన్ 19 : జాతీయ రహదారి-565 విస్తరణలో భాగంగా ఫీల్డ్ ఎంక్వైరీ లేకుండా పేపర్ ద్వారా రూపొందించిన మూడో అలైన్మెంట్తో మూడు వేల మందికి అన్యాయం జరుగుతుందని నేషనల్ హైవేలో ప్లాట్లు, ఇండ్లు కోల్పోతున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆదుకోవాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని బుధవారం ఆశ్రయించారు. నల్లగొండ వీటీ కాలనీలోని తన కార్యాలయంలో బాధితులతో కూర్చొని వారి ఆవేదన విన్నారు.
ఈ సందర్భంగా బాధితులు మూడో అలైన్మెంట్ కాపీనీ కంచర్లకు చూపించి దీన్ని ఆపాలని కోరారు. మొదటి, రెండో అలైన్మెంట్లను పక్కకు పెట్టి కొందరి ప్రయోజనాల కోసం మూడో అలైన్మెంట్ సృష్టించి అమలు చేస్తున్నారని తెలిపారు. మూడో అలైన్మెంట్ అమలైతే మూడు వేల మందికి సంబంధించిన ప్లాట్లు, ఇండ్లు కోల్పోతారని తెలిపారు. ఒక్కొక్కరి ఆవేదన విన్న కంచర్ల గతంలో రూపొందించిన మొదటి లేదా రెండో అలైన్మెంట్ మాత్రమే అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని, నల్లగొండ వేదికగా జరిగే ఉద్యమంలో బాధితులు పాత్రధారులు కావాలని పిలుపునివ్వగా అందరూ అంగీకరించారు.
ఎన్‌హెచ్-565 విస్తరణలో ఎవరూ నష్టపోవద్దనే ఉద్దేశంతో గతంలో రెండు అలైన్మెంట్లు సిద్ధం చేస్తే దాన్ని పక్కకు పెట్టిన మంత్రి కోమటిరెడ్డి వారి అనుచరుల భూముల విలువ పెంచడానికి మూడో అలైన్మెంట్ తీసుకొచ్చారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆరోపించారు. పానగల్ బ్రిడ్జి నుంచి దుప్పలపల్లి, అన్నారం ద్వారా ఎస్ఎల్బీసీ వరకు అలైన్మెంట్ చేయడం వల్ల అక్కడ ఉన్న రైతుల భూమి కొంచెం పోతే వారి భూములకు విలువ పెరుగుతుందని ఆలోచనతో నాడు ఆ అలైన్మెంట్ చేయించినట్లు తెలిపారు.
ప్రస్తుతం దానిని పక్కన పెట్టి కోమటిరెడ్డి మూడో అలైన్ మెంట్ చేయిస్తున్నారని, దాన్ని అడ్డుకుంటామని చెప్పారు. త్వరలో నిర్వహించబోయే పోరాటానికి బాధితులందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, బీఆర్ఎస్ కనగల్ మండలాధ్యక్షుడు ఐతగోని యాదయ్య, నాయకులు దోనాల నాగార్జునరెడ్డి, కందిమల్ల వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.