Jagadish Reddy | నూతనకల్, మార్చి 8 : ‘సుభిక్షంగా ఉండాల్సిన రైతులు వేసిన పంటలు ఎండి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మీకు చేతగాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ చేతికి అప్పగించండి. మూడో రోజే ఎస్సారెస్పీ కాల్వలకు నీళ్లు ఇచ్చి చూపిస్తం’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. ఎస్సారెస్పీ కాల్వలకు నీళ్లు లేక నూతనకల్ మండల కేంద్రంలో ఎండిన వరి పంటలను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు కేసీఆర్ పాలనలో పుష్కలంగా నీళ్లు రావడంతో ఏ రందీ లేకుండా పంటలు పండించామని, ఇప్పుడు కాల్వలకు నీళ్లే రావడం లేదని వాపోయారు.
అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన పంటలు పొట్ట దశలో చేతికి అందకుండా పోతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అయిన రైతులు సైతం కాంగ్రెస్‌కు ఓటుకు వేసి కష్టాలు కొనితెచ్చుకున్నట్టు ఉందని, కేసీఆర్ పాలనలోనే వ్యవసాయం బాగుందని కండ్ల నీళ్లు తీస్తూ చెప్పుకొచ్చారు. రైతుల కష్టాలు చూసి చలించిన జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌పై ఉన్న కోపంతో కాళేశ్వరం నీళ్లు విడుదల చేయకుండా రేవంత్ సర్కారు రైతులకు అన్యాయం చేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ హయాంలో తుంగతుర్తి నియోజకవర్గంలో రెండు పంటలకు ఎస్సారెస్పీ జలాలను విడుదల చేయించి ఒక్క గుంట పొలం కూడా ఎండిపోకుండా చూశామని గుర్తుచేశారు.
నేడు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు దోచుకోవడానికే సమయం వెచ్చిస్తున్నారు తప్ప.. రైతు సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునే సోయి లేదని విమర్శించారు. నియోజకవర్గంలోని 69వ డీబీఎం కాల్వకు ఇరువైపులా ఉన్న పంట పొలాలు ఎండిపోతుండడం శోచనీయమన్నారు. ఈ సంవత్సరం కూడా గోదావరికి పుష్కలంగా వరద వచ్చిందని, ఆ నీళ్లన్నీ ఎటుపోయాయని ప్రశ్నించారు. రైతు భరోసా రూ.15వేలు, వడ్లకు బోనస్, రూ.2లక్షల రుణమాఫీ, చివరి ఆయకట్టు వరకు రెండు పంటలకు నీళ్లు ఇస్తామంటే నమ్మి ఓటేసిన రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు.
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టైమ్ ఇస్తే ఎండిన పొలాలను చూపించడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆంధ్రాకు గోదావరి జలాలు తీసుకుపోతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించినా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. రైతుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి సమస్యలను పట్టించుకోకుండా పట్టణ ప్రాంతాలకు పరిమితమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనూ నీళ్లు లేక పంటలు ఎండిన దాఖలాలు లేదన్నారు. నేడు గోదావరి జలాలు రావడం లేదని స్వయంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులే రోడ్లపై ధర్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొందని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. లేకుంటే రైతులతో కలిసి పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఎస్ఏ రజాక్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, మాజీ జడ్పీటీసీలు గుగులోతు నర్సింగ్‌నాయక్, జీడి భిక్షం, నాయకులు గాజుల తిరుమలరావు, బిక్కి బుచ్చయ్య, బత్తుల విద్యాసాగర్, లింగరాజు, పరమేశ్, బాబు, విజయ్, వీరుయాదవ్, వెంకన్న, మహేశ్ పాల్గొన్నారు.
మళ్లీ కేసీఆర్ వస్తేనే మా తలరాతలు మారుతాయి
సారూ.. పొరపాటు జరిగింది. మళ్లీ కేసీఆర్ వస్తేనే మా తల రాతలు మారుతాయని పలువురు రైతులు పేర్కొన్నారు. రెండు పంటలకు కాళ్వేశరం జలాలతోపాటు రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ బీఆర్ఎస్ పాలనలోనే అందాయని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేవు.. పంటకు పెట్టుబడి లేదు.. రైతు బీమా లేదు.. సన్న వడ్లకు బోనస్ లేదు అని వాపోయారు. పచ్చి అబద్ధాలు చెప్పి తమను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.