యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): చనిపోయిన పాత నళినిని ఎక్యుమేషన్ చేసి బయటకు తీసి, తన ప్రశాంత జీవితంలో సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ తుఫాన్ సృష్టించారని, తనకు ఏమైనా జరిగితే ఆయనదే పూర్తి బాధ్యత అని మాజీ డీఎస్పీ దోమకొండ నళిని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై మరోసారి ఫేస్బుక్లో మరణ వాంగ్మూలం పేరుతో పోస్టు చేశారు. ‘సీఎంకు నా ఫైల్ డిస్పోస్ చేయడం ఇష్టం లేనట్లు తోస్తోంది. నవమి నాటికి నా విషయం ఎటూ తేలకపోతే నేను సజీవ సమాధి అవుతా. నేను ఏ రకంగా చచ్చినా అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. దీనికి నా ఫేస్బుక్ పోస్టులే సాక్ష్యం’ అని పేరొన్నారు.
‘రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే వ్యాధి తీవ్ర స్థాయిలో రావడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. రాష్ట్రపతి మెడల్ లక్ష్యంగా డైనమిక్ ఆఫీసర్‌గా పని చేసిన నన్ను సస్పెండ్ చేయడం.. వెంటాడి వేటాడటం.. నా అన్ని సమస్యలకు మూల కారణం కాంగ్రెస్. నేటి నా దుస్థితికి రేవత్రెడ్డికి 21 నెలల క్రితం నేనిచ్చిన రిపోర్ట్‌పై ఇంకా చర్య తీసుకోకుండా నిర్లిప్తంగా ఉండడం తక్షణ కారణం. ఇది చాలా హేయనీయం. వారికి ఫైల్ డిస్పోస్ చేయడానికి ఇంత సమయం ఎందుకు పడుతుందో అర్థం కావడం లేదు. వారి ఇంటెన్షన్ ఏంటో తెలియడం లేదు. ప్రస్తుతం ఇది మరింత స్ట్రెస్‌కు గురి చేస్తోంది. బహుశా ఇదే నా చావుకు దారి తీస్తుందేమో’ అని తెలిపారు.
‘నేను ఇచ్చిన రిపోర్ట్ సీఎం చేతిలో పెట్టినప్పుడు దాన్ని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి చూస్తారని చెప్పారు. ఆపై నాలుగు నెలలకు ఓస్డీ వేముల శ్రీనివాస్ చేతుల్లోకి పోయింది. ప్రస్తుతం మా బ్యాచ్‌మేట్ అయిన కలెక్టర్ హనుమంతరావు చేతుల్లో ఉంది. అంటే నా స్థాయిని ఎలా తగ్గిస్తున్నారో తెలుస్తోంది. నా మరణ వాంగ్మూలాన్ని కలెక్టర్‌తో రికార్డ్ చేయించడం మినహా సీఎం ఇప్పటి వరకు ఇంకేమీ చేయలేదు. సంధ్యా థియేటర్లో తొకిసలాటలో మరణించిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవడానికి వారికి వారం కూడా పట్టలేదు. నా విషయంలో సంవత్సరాల తరబడి కావాలని తాత్సారం చేస్తున్నారు. నా చెవులతో సీఎం స్టేట్మెంట్ వినాలి. నా ఎమోషన్స్ అర్జెంట్ గా చల్లారాలి. లేదంటే బ్రెయిన్‌డెడ్ అయ్యేలా ఉంది’ అని వాపోయారు.