యాదగిరిగుట్ట, ఏప్రిల్ 6 : ‘మాకే కాదు.. మా పార్టీ క్యాడర్‌కు నచ్చకపోయినా బదిలీలు తప్పవు. ఇష్టం లేకున్నా వెళ్లాల్సిందే.. భరించాల్సిందే’నని ఆలేరు నియోజకవర్గంలోని ఓ కీలక ప్రజాప్రతినిధి అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. ‘తప్పు.. ఒప్పు అంటూ చెప్పొద్దు. మేం చెప్పిన పనులను 60 శాతమో, 30 శాతమో కాదు.. వంద శాతం చేయాల్సిందే. లేకపోతే ఇక్కడ ఉండడానికి వీళ్లేదు’ అంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ఇటీవల యాదగిరిగుట్ట ఎంపీఓ సలీమ్‌ను మోటకొండూర్‌కు బదిలీ చేసి, అక్కడ పని చేస్తున్న చంద్రశేఖర్‌ను గుట్టకు తీసుకురావాలని కొందరు పంచాయతీ కార్యదర్శులు ఓ మాజీ ఎంపీపీని కలిసి విన్నవించుకున్నారు. ఆయన సదరు కీలక ప్రజాప్రతినిధిపై ఒత్తిడి తీసుకువచ్చి సలీమ్‌ను మోటకొండూరుకు బదిలీ చేయించగా.. నేడో, రోపో ఉత్తర్వులు అందనున్నట్లు తెలిసింది. కాగా, చంద్రశేఖర్ యాదగిరిగుట్టకు రావడానికి ఆస్తకిగా లేనట్లు సమాచారం. వాస్తవానికి ఆయన నాలుగేండ్లపాటు యాదగిరిగుట్టలో పని చేశారు.
యాదగిరిగుట్ట సీఐపైనా!
యాదగిరిగుట్ట పట్టణ సీఐ త్వరలో బదిలీ కానున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్నది. సీఐ తమకు అనుకూలంగా పని చేయడం లేదని, అన్నీ రూల్స్ మాట్లాడుతున్నారని, ఆయన ఉంటే మన పనులు సాగవని సీఐతోపాటు ఏసీపీని కూడా బదిలీ చేయాలన్న యోచనలో సదరు కీలక నేత ఉన్నట్లు సమాచారం. గతంలో పట్టణ సీఐగా పని చేసిన శంకర్‌గౌడ్‌ను తీసుకువచ్చే పనిలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
గతంలో సీఐగా పని చేసి ఏసీపీగా పదోన్నతి పొంది హెచ్ఎండీఏలో పని చేస్తున్న జానకిరెడ్డిని గుట్ట ఏసీపీగా తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు సాగుతుండగా.. ఆయన ఇక్కడికి రావడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో ఆలేరు నియోజకవర్గంలో పని చేయాలంటే ఇబ్బందిగా ఉందని పలువురు అధికారులు వాపోతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి తమ పని చేసి పెట్టాల్సిందేనని, లేకపోతే తమ ‘నేత’తో చెప్పి బదిలీ చేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులు సహా అన్ని విభాగాల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.