మర్రిగూడ,జూలై 15 : మరిగ్రూడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలవరపెడుతున్నాయి. పర్యవేక్షణ లోపం కారణంగానే హాస్టల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సోమవారం రాత్రి అన్నం తిన్నాక 18 మంది బాలికలకు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడటంతో స్థానిక దవాఖానకు తరలించగా వైద్యులు చికిత్స చేశారు.
విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో దవాఖాన వద్దకు వచ్చి, ఎలాంటి అపాయం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో కూడా ఫుడ్ పాయిజన్ కావడంతో మండలంలోని లెంకలపల్లికి చెందిన ఓ బాలిక రాత్రి సమయంలో తీవ్ర కడుపునొప్పితో బాధపడింది. ఆ సమయంలో వార్డెన్, కేర్ టేకర్, నర్సు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో సాయం కోసం విద్యార్థినులు రాత్రి సమయంలో రోడ్డు పైకి వచ్చారు.
అటుగా పెట్రోలింగ్ వచ్చిన పోలీసులు ఆ బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటన మరువకముందే మరోసారి ఫుడ్పాయిజన్ కావడంతో అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై హాస్టల్ ప్రత్యేకాధికారి వివరణ కోరగా ఆదివారం కావడంతో హాస్టల్లో నాన్వెజ్ వండినట్లు తెలిపారు. విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా అదే రోజు భోజనం తేవడంతో వారు ఆ భోజనాన్ని మరుసటి రోజు కూడా తినడంతో ఫుడ్పాయిజన్ జరిగి ఉండవచ్చని అన్నారు.