మిర్యాలగూడ, జూలై 14 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీ ఫిరాయింపులపై కాకుండా ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు దాటినా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 40 రోజులు దాటినా ఇంతవరకూ పాలనపై దృష్టి సారించడం లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, రైతు భరోసా, పింఛన్ల పెంపు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం వంటి హామీలను గాలికి వదిలేసిందని విమర్శించారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో విఫలమవుతున్నారన్నారు. రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలను సకాలంలో అందించాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేశ్, మల్లు గౌతంరెడ్డి, రెమడాల పరశురాములు, పాదూరి శశిధర్రెడ్డి, రామ్మూర్తి, అప్పారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.