తుంగతుర్తి, మే 22 : తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో పని చేస్తున్న హమాలీ చర్లపల్లి సోమయ్య (69) వడదెబ్బకు గురై గురువారం రాత్రి మరణించాడు. శుక్రవారం తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు వారి కుటుంబాన్ని పరామర్శించి మృతుడి భార్యకు తుంగతుర్తి రైతు సేవా సహకార సంఘం తరఫున రూ.10,000 దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడదెబ్బకు గురై మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.4 లక్షల ఎక్స్గ్రేషియాను అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ దయానందం, ఎస్ఐ క్రాంతి కుమార్, రైతు సేవా సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.