నల్లగొండ ప్రతినిధి/యాదాద్రి భువనగిరి, మార్చి18(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ వైపు ఉమ్మడి జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నిధుల వరద, ప్రాజెక్టుల మంజూరుపై ఆశలు పెట్టుకున్నారు. గత బడ్జెట్లో నిరాశ మిగల్చగా, ఈ నెల 19న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార అసెంబ్లీలో ప్రవేశ పెట్టే పద్దులోనైనా కనికరిస్తారో, లేదో చూడాల్సి ఉంది. ఉమ్మడిజిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, భూసేకరణ, పెండింగ్ పనులు, కీలక రహదారులు, పలు కొత్త ప్రాజెక్టులు, యాదగిరిగుట్ట ఆలయానికి నిధులతోపాటు అభివృద్ధిలో కీలకమైన అంశాల పట్ల నిధుల కేటాయింపుపై ప్రజల్లో ఉత్కంఠత నెలకొంది.
ఉమ్మడి జిల్లా పరిధిలో కీలక సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధుల కేటాయింపు చాలా అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు పూర్తయినా కీలక ప్రాజెక్టుల్లో పెద్దగా పురోగతి లేదు. కేవలం జిల్లా మంత్రుల, ఎమ్మెల్యేల మాటల్లోనే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటనలు వినిపిస్తున్నాయి. అవి కార్యరూపం దాల్చలంటే నేటి బడ్జెట్లో నిధుల కేటాయింపే కీలకం. జిల్లాలో కీలకమైన ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని వచ్చే మూడేండ్లల్లో పూర్తి చేస్తామని పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ, దీన్ని పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను ఏ మేరకు కేటాయిస్తారన్నది తేలాల్సి ఉంది. ఇదే తరహాలో డిండి ఎత్తిపోతల పథకాన్ని సైతం మూడేండ్లల్లో పూర్తి చేస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. బ్రాహ్మణవెల్లంల ఉదయం సముద్రం ఎత్తిపోతల పథకంలో కీలకమైన భూ సేకరణ, కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల తవ్వకాలన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వతోపాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు కూడా లైనింగ్ చేస్తామన్న ప్రకటనలు ఉన్నాయి. వాటితోపాటు మూసీ, ధర్మారెడ్డికాల్వ, పిలాయిపల్లి కాల్వల పనులకు నిధులు అవసరం ఉన్నాయి. ఇక సాగర్ ప్రాజెక్టు, ఎడమకాల్వ మరమ్మతులు, దానిపై లిఫ్ట్‌ల నిర్వహణ తదితర అంశాలకు నిధుల విషయం తేలాల్సి ఉంది. జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండడంతో నిధుల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది.
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లోనే యాదగిరిగుట్ట ఒకటి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సుమారు రూ.1,200 కోట్లతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారు. ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ ఎప్పటికప్పుడు ప్రాధాన్య క్రమంలో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు కృషి చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిధుల కొరతతో పనులు ముందుకు సాగడం లేదు. కొండ కింద వైకుంఠ ద్వారం సమీపంలో గల ఆర్య వైశ్య సత్రం నుంచి ఎంట్రీ ఫె్లై ఓవర్ కోసం నెట్ వర్ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టారు. ఇందులో 7 ఫిలర్లు, 32 మీటర్ల మేర నిర్మాణం పూర్తయింది. లండన్ నుంచి దిగుమతి చేసుకున్న నెట్ వర్ ఆర్చ్ బ్రిడ్జిని బిగించాల్సి ఉంది. రూ.69 కోట్లలో రూ.34కోట్లు మంజూరు చేయగా రూ.20కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.14 కోట్లు కావాలి. రూ.290కోట్లతో యాదగిరిగుట్ట నుంచి రాజాపేట మీదుగా చేర్యాల వరకు సుమారు 37 కిలోమీటర్లు, యాదగిరిగుట్ట నుంచి వంగపల్లి వరకు సుమారు 5 కిలోమీటర్ల ఫోర్ లేన్ బీటీ రోడ్డు చేపట్టాల్సి ఉంది. ఇంకా అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
రైతుల తలరాతను మార్చే బస్వాపూర్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. తుది దశకు వచ్చిన ఈ ప్రాజెక్టుకు పట్టించుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లాతోపాటు నల్లగొండలోని కొన్ని మండలాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్ట్ కు తక్షణం రూ.500 కోట్లు కావాలని నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇటీవల 50 కోట్లు విడుదల చేయగా, సరిపోవని పెండింగ్‌లో పెట్టారు. నిధులను వినియోగించకపోవడంతో ఇతర అవసరాలకు మళ్లించినట్టు తెలుస్తున్నది. నిధులు వస్తేనే ముంపు గ్రామం బీఎన్ తిమ్మాపూర్ గ్రామాన్ని ఖాళీ చేసే అవకాశం ఉంటుంది. తురపల్లి మండలంలో ఉన్న గంధమల్ల రిజర్వాయర్‌కు సంబంధించి గతంలోనే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని కుదించినా ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు. ఇక వృథాగా పోతున్న మూసీ జలాలను సద్వినియోగం చేసుకుని ఆయకట్టును మరింత స్థిరీకరించేందుకు ఉద్దేశించిన భువనగిరి నియోజకవర్గంలోని ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, బునాదిగాని కాల్వల ఆధునికీకరణ ఊసే లేదు. గతేడాది పిల్లాయిపల్లి కాల్వకు రూ.86 కోట్లు, ధర్మారెడ్డిపల్లికి రూ.124 కోట్లు, బునాదిగాని కాల్వకు 266 కోట్లు పరిపాలన అనుమతులు ఇచ్చింది. నిధులు విడుదల కావాల్సి ఉంది.
భువనగిరి-చిట్యాల, నల్లగొండ-దేవరకొండ, చండూరు-ఘట్టుప్పల్-నారాయణపురం తదితర కీలక రహదారులు విస్తరించాల్సి ఉంది. కానీ విస్తరణకు నోచకపోవడంతో రోజూ ఈ రోడ్లపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిపై ఇప్పటికే జిల్లాకు చెందిన ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పలుమార్లు ప్రకటనలు చేశారు. వీటిని పూర్తి చేయాలంటే అందుకు తగ్గట్లుగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. చిట్యాల-భువనగిరి రహదారి విస్తరణ టెండర్ ప్రక్రియ జనవరి 2024లోపు పూర్తి చేయిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇంకా జిల్లాలో పలు కీలక లింక్ రహదారుల విస్తరణ కూడా జరుగాల్సి ఉంది.
జిల్లాలో కీలక ప్రా జెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన బస్వాపూర్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తయ్యింది. నిధులిస్తే జిల్లా సస్యశ్యామలం అవుతుంది. బునాదిగాని కాల్వ, ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాల్వలకు నిధులు విడుదల చేయాలి.
– కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు