నల్లగొండ, మే 26 : వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, గత 3 సీజన్లుగా పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా డబ్బులను పూర్తిగా చెల్లించాలని, అలాగే కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లించాలని కిసాన్ మోర్చా నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా కిసాన్ మోర్చ, నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠికి సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానాకాలం సీజన్ ప్రారంభమైనందున రైతులు తమ వ్యవసాయ భూముల్లో దుక్కులు దున్ని సిద్దంగా ఉన్నందున అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు అందించాలన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పటిష్టమైన విజిలెన్స్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడి కోసం పెండింగ్‌లో ఉన్న రెండు సీజన్ల రైతు భరోసా అందించడంతో పాటు, రుణమాఫీ చేయాలన్నారు. అలాగే రైతులు విక్రయించిన ధాన్యానికి వెంటనే క్వింటాల్‌కు రూ.500 చెల్లించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జాతీయ నాయకులు, కేరళ రాష్ట్ర ఇన్చార్జి గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరెల్లి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, జిల్లా కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పిండి పాపిరెడ్డి, పట్టణ(1) అధ్యక్షుడు గడ్డం మహేశ్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కోశాధికారి హనుమంతురెడ్డి అశోక్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుండ్ల సాయన్న, గుండా నవీన్ రెడ్డి మత్స్యశాఖ కన్వీనర్ లోకనబోయిన రమణ ముదిరాజ్, బీజేపీ సీనియర్ నాయకులు బైరగోని రాజయ్య, బీజేపీ రాష్ట్ర ఫామ్ మెకానిజెన్సీల్ కన్వీనర్ డి.కోటేశ్వర్ రెడ్డి, ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసోజు యాదగిరిచారి, జిల్లా కౌన్సిల్ మెంబర్ బేరు సత్తయ్య గౌడ్, బిపంగి జగ్జీవన్, మంగినపల్లి కిషన్, అక్కెనపల్లి బలరాం, తిక్కనబోయిన బంగారి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.