నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ)/నల్లగొండ సిటీ : భుజాలపై లోఓల్టేజీతో కాలిపోయిన మోటార్లు…చేతి లో ఎండిన వరి నారుతో.. రైతులు నల్లగొండలో పట్టణంలో కదం తొక్కారు. అప్రకటిత కోతలతో పాటు లోడుకు సరిపోనూ కరెంటు సరఫరా కాకపోవడంతో ప్రభుత్వం తమ నడ్డివిరుస్తోందని నకిరేకల్ ప్రాంత రైతులు కన్నెర చేశారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన రైతులు పెద్ద సం ఖ్యలో ద్విచక్ర వాహానాలతో పాటు ఇతర మార్గాల్లో చలో నల్లగొండ కార్యక్ర మం చేపట్టారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ప్రధాన గేటుకు అడ్డం గా బైఠాయించారు. రైతుల దుస్థితిని చూపేందుకు తమతో తెచ్చిన కాలిన మోటర్లను, ఎండిన వరి పంటను అక్కడే నేలపై పెట్టి నిరసనకు దిగారు. లోఓల్టేజీ సమస్యను పరిష్కరించాలని, నిరంతరం నాణ్యమైన కరెం టు ఇవ్వాలని, కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగా కరెంటు సరఫరా చేసి రైతులను ఆదుకోవాలంటూ చేసిన నినాదాలతో ఎస్ఈ కార్యాలయ ఆవరణ మార్మోగింది. కొద్దిరోజులుగా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కరెం టు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
కొన్నిసార్లు రోజుకు కనీసం 10 గం టల కరెంటు కూడా సరఫరా కావడం లేదు. ఇందులోనూ అనేక సార్లు ఓవర్ లోడ్‌తో ట్రిప్ కావడంతో మోటర్లు సాగడం లేదు. అసలే ఎల్‌నినో ప్రభావంతో అం తంత మాత్రంగానే వేసిన పంటలు సైతం ఎండిపోతున్నాయి. సీజన్ ప్రారంభంలోనే పెద్ద ఎత్తున అప్రకటిత కరెంటు కోతలు విధిస్తుండటంతో రైతులు ఆగ్రహంతో రోడ్లెక్కుతున్నారు. కొద్దిరోజులుగా నకిరేకల్ నియోజకవర్గంలో రైతులు కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను స్థానిక అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తెచ్చి నా ఫలితం లేకపోవడంతో చివరకు రైతుల పక్షాన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం నల్లగొండలోని ట్రాన్స్‌కో ఎస్ ఈ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో నియోజకవర్గానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో నల్లగొండకు తరలివచ్చారు. ఎస్ఈ కార్యాలయ ప్రధాన గేటు ఎదుట బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా లోఓల్టేజీ సమస్య ను పరిష్కరించాలని, నాణ్యమైన 24 గం టల కరెంటు ఇవ్వాలని, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా రైతులకు అండగా నిలవాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నిరంతర కరెంటు ఇస్తామని హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన విరమించేది లేదని నినదించారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా రెండు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. అనంతరం ట్రాన్స్‌కో ఎస్ఈ రైతుల వద్దకు వచ్చి వినతపత్రం స్వీకరించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాదరిగా రైతాంగానికి 24 గంటల నాణ్యమైన కరెం టు ఇవ్వాలని చిరుమర్తి లింగయ్య డిమాం డ్ చేశారు. అలా ఇవ్వడం చేతకాకపోతే రేవంత్‌రెడ్డి తప్పుకోవాలన్నారు. అడ్డమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక రేవంత్‌రెడ్డి చేతగాని తనంతో రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వానకాలం పంటల సీజన్ ప్రారంభం నుంచే అప్రకటిత కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరెంటు కోతలు, లోఓల్టేజీ సమస్యపై స్థానిక అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువచ్చినా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సగటును 10 గంటలకు మించి వ్యవసాయానికి కరెంటు రావడం లేదన్నారు. కరెంటు కోతలతో ప్రభుత్వం దాగుడు మూతలు ఆడుతోందని, కనీసం సబ్‌స్టేషన్ లాగ్‌బుక్స్‌లో వివరాలు కూడా నమోదు చేయడం లేదన్నారు. ఎంత కరెంటు సరఫరా అవుతుందన్న విష యం బట్టబయలవుతుందన్న భయంతో లాగ్ బుక్స్‌లో రాయడమే బంద్ పెట్టారన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 24 గంటల కరెంటును ప్రవేశపెడితే దాన్ని తుంగలో తొక్కుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు, రైతు బీమాకు రేవంత్ సర్కార్ ఎగనామం పెట్టిందన్నారు.
అరకొర రుణ మాఫీ, ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో దోపిడీతో రైతులను మోసం చేస్తోందన్నారు. యూరియా, ఎరువుల కోసం రైతులు పడిగాపులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన నిరంతర కరెంటుకు సైతం కోతలు పెడుతుండని మండిపడ్డారు. తక్షణమే రైతు ల సమస్యలను పరిష్కరించి విద్యుత్ సరఫరాను సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు. కరెంట్ లేక పోలాలు ఎండి పోయి, లోఓల్టేజీతో మోటర్లు కాలిపోయి… రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సీఎం, మంత్రులకు, ఎమ్మెల్యేలకు రైతుల సమస్యలను పట్టించుకునే తీరిక లేదా అని ప్రశ్నించారు. ప్రజలను దోచుకోవడం…రానున్న కాలానికి దాచుకోవడమే తమ లక్ష్యమన్నట్లుగా ఈ ప్రభుత్వ పెద్దల తీరు ఉందన్నారు. కనీసం రైతుల బాధ చెప్పేందుకు జిల్లా అధికారులను కలవడానికి వస్తే గేట్లకు తాళాలు వేసి పోలీసులతో కాపాలాపెడుతుండడం దారుణమన్నారు. తక్షణమే విద్యుత్తు సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్ ముట్టడికి సైతం వెనుకాడేది లేదని చిరుమర్తి హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాచకొండ శ్రీనివాస్, కొప్పుల ప్రదీప్‌రెడ్డి, తరాల బలరాం యాదవ్, దూదిమెట్ల సత్తయ్య యాదవ్, చిరుమర్తి యాదయ్య, మేకల రాజిరెడ్డి, నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, ఏశబోయిన మల్లేశ్, మల్లారెడ్డి, సతీశ్‌గౌడ్, ప్రసాద్, వడ్డే సైదిరెడ్డి, సామ శ్రీనివాసరెడ్డి, రాచకొండ వెంకన్నగౌడ్, బంటు మహేందర్, సురేశ్‌తో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యక ర్తలు రైతులు పాల్గొన్నారు.