నల్లగొండ, ఆగస్టు 4: ఏఎమ్మార్పీ డి 39,40 కాల్వల ద్వారా తిప్పర్తి, మాడ్గులపల్లి మండల పరిధిలోని గ్రామాలకు సాగునీరందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠికి, నీటిపారుదల శాఖ కార్యాలయం ఈఈకి సోమవారం రైతులు వినతి పత్రం అందజేశారు. అనంతరం నీటి పారుదల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా నాయకులు కందుల లక్ష్మయ్య, రైతులు మాట్లాడుతూ ఏఎమ్మార్పీ డీ 39,40 కాల్వ ద్వారా నీటిని పూర్తిగా కాల్వలకు అందజేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
ఎన్నో ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న ఈ ప్రాంత రైతులకు ఏఎమ్మార్పీ కాల్వల ద్వారా నీరందించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఓవైపు బ్రాహ్మణ వెల్లెంల అయిటిపాముల కాల్వలకు పూర్తిస్థాయిలో నీరందిస్తూ తిప్పర్తి, మాడ్గులపల్లి ప్రాంత రైతుల పట్ల పక్షపాత వైఖరి చూపుతున్నారన్నారు. వారబందీ అమలు చేస్తున్నామంటూ అధికారులు పూర్తిస్థాయిలో తిప్పర్తి,మాడ్గులపల్లి మండలాలకు వచ్చే కాల్వలకు నీరు వదలటం లేదని అయిటిపాముల బ్లాక్‌కు వెళ్లే షట్టర్లను కొంతమంది దుండగులు ద్వంసం చేసినా అధికారులు వాటికి మరమ్మతు చేయకుండా తాత్సరం చేస్తున్నారన్నారు.
ద్వంసమైన షట్టర్ల ద్వారా కిందికి నీరు వెళ్లి ఈ రెండు మండలాలకు సాగునీరందక, చెరువు కుంటల్లో నీరు లేక భూగర్భ జలాలు పడిపోయి, పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తిప్పర్తి మండలం తనకు గుండెకాయలాంటిదని చెప్పే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఈ ప్రాంత రైతుల గోస కనపడట్లేదా అని వారు తీవ్రంగా విమర్శించారు. మంత్రి నిర్లక్ష్యం వల్ల వందల టీఎంసీల నీరు సాగర్ నుంచి సముద్రం పాలవుతున్నా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పూర్తి స్థాయిలో పానగల్ ఉదయ సముద్రానికి నీరందడం లేదన్నారు.
ఉదయ సముద్రానికి వచ్చే నీటిపై మంత్రికి అవగాహన లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు డీ39,40 కాల్వల ద్వారా చివరి భూముల వరకు పూర్తిస్తాయిలో నీరందించి చెరువులు,కుంటలను నింపాలన్నారు. ధర్నాలో ముకిరాల కృష్ణ, గుండెబోయిన రామచంద్రు ,గుండెబోయిన నాగరాజు,దేవిరెడ్డి లింగారెడ్డి,బొల్లె ద్దు వెంకన్న,అంతటి చెన్న కేశవులు, చింతకుంట దయాకర్ రెడ్డికే సురేందర్‌రెడ్డి, చెదురుపల్లి జ నార్ధన్, చిన్న గోని వెంకన్న, రొట్టెల జా నయ్య, జక్కలి రవి, కట్టా బిట్టుతోపాటు పలువురు రైతు లు పాల్గొన్నారు.