నల్లగొండ, డిసెంబర్ 5 : ‘దొడ్డు ధాన్యం క్వింటాకు రూ.2,320 ఇస్తాం.. సన్న ధాన్యానికి క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ అందజేస్తాం’ అని వానకాలం కోతలు మొదలైన దగ్గర నుంచి ఊకదంపుడు ఉపన్యాసాలను చేసిన ప్రభుత్వ పెద్దల మాటలను జిల్లా రైతాంగం పట్టించుకోలేదు. అరకొరగానే రుణ మాఫీ, రైతు భరోసా ఊసే లేకుండా పోవడంతో సీఎం, మంత్రుల మాటలు నమ్మేటట్టు లేదని పండించిన ధాన్యాన్ని రైతులు నేరుగా మిల్లుల్లోకి తీసుకెళ్లి అమ్మారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఈ సీజన్లో పేరుకే కొనసాగాయి. నల్లగొండ జిల్లాలో ఈ సీజన్‌కు సంబంధించి మొత్తం 7.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని అధికార యంత్రాంగం ప్రకటించినప్పటికీ ఇప్పటిదాక రెండు లక్షల మెట్రిక్ టన్నులు దాటకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటికే 80శాతం వరి కోతలు పూర్తి కాగా ఇంకా 20శాతం మాత్రమే ఉన్నాయి.
అవి కూడా సన్నాలే కావడంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చే పరిస్థితి లేదని వ్యవసాయ అధికారులే అంటున్నారు. ఈ సీజన్లో సన్నాలు కొనుగోలు చేసి వచ్చే జనవరి నుంచి రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తామన్న ప్రభుత్వం చెబుతున్నది. పెద్ద జిల్లా అయిన నల్లగొండలోనే ఇప్పటి వరకు 18వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారంటే ఉచిత బియ్యం పరిస్థితి ఏంటనే ప్రశ్నకు సర్కారు పెద్దలే సమాధానం వెతుక్కోవాల్సి ఉంది.
జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 5.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా అందులో సన్నరకం 53శాతం, దొడ్డు రకం 47శాతం ఉన్నాయి. మొత్తంగా 12.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా స్థానిక అవసరాలు పోను ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 7.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారులు కొనుగోలు చేస్తామని ప్రకటించిన ధాన్యంలో ఇప్పటి వరకు 25శాతం ధాన్యం మాత్రమే ప్రభుత్వ రంగ కొనుగోలు కేంద్రాలకు రాగా మరో 10వేల మెట్రిక్ టన్నులు సెంటర్లల్లో ఉన్నది. ఇందులో దొడ్డు వడ్లు 1.74లక్షల మెట్రిక్ టన్నులు, సన్నాలు 18వేల మెట్రిక్ టన్నులే. ఇక మరో 20శాతం కోతలు ఉన్నప్పటికీ అవి పూర్తిగా సన్నాలే కావడంతో మి ల్లుల్లోనే రైతులు అమ్మే అవకాశం ఉన్నది.
ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మని రైతులు వారు పండించిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వ రంగ సంస్థల్లో అమ్మడానికి ఇష్టపడలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నప్పటికీ రైతుల నమ్మకాన్ని చూరగొనలేపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. క్వింటాకు రూ.2,320 ఇస్తామని..సన్న ధాన్యం పండించిన రైతులకు బోనస్ ఇస్తామని చెప్పినప్పటికీ నమ్మకుండా మిల్లుల్లోనే అమ్మినట్లు రైతుల చెప్పుతున్నారు. రుణమాఫీ చేస్తామని అరకొరగానే చేసిన సర్కా ర్ గత యాసంగిలో మాత్రమే రైతు బంధు ఇచ్చి రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ. 15వేలు ఇస్తామని ఇప్పటి వరకు రెం డు సీజన్లుగా ఇవ్వలేదు. దీంతో బోనస్ కూడా నమ్మలేకనే మిల్లుల్లో అమ్మినట్లు రైతులు అంటున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేషన్ కింద పేదలకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తామని ప్రకటించినా ఈ సీజన్లో కొనుగోలు చేసి వచ్చే జనవరి నుంచి ఇస్తామని ప్రకటించి ఏర్పాట్లు చేస్తున్నది. కొనుగోలు కేంద్రాలకు సన్న బియ్యమే రాకపోవడంతో ఉచిత బియ్యం పరిస్థితి ఏంటో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. రాష్ట్రంలో అత్యంత నిడివి కలిగి ఎక్కువ వరి దిగుబడి వచ్చే నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో 2.70లక్షల ఎకరాల్లో సన్న ధాన్యం సాగు అయినప్పటికి ఇప్పటి వరకు కేంద్రాలకు వచ్చింది 18వేల మెట్రిక్ టన్నులు మాత్రమే. కొనుగోల్లు ముగిసే సరికి మరో పదివేల మెట్రిక్ టన్నుల మేరకు రావచ్చు. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ సర్కా ర్ సన్న బియ్యం పంపిణి ఏమైద్దో చూ డాల్సిందే. ఇదిలా ఉండగా ఆయకట్టులో వానకాలం సీజన్‌కు సంబంధించి ఇంకా 20 శాతం కోతలు ఉండగానే నాన్ ఆయకట్టు లో యాసంగి సీజన్‌కు సంబంధించి నాట్లు షురూ అయ్యాయి. ఈ ఏడాది యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 5,83,620 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
జిల్లా వ్యాప్తంగా 340 కేంద్రాలు ప్రారంభించి ఇప్పటివరకు 1.98లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఇంకా ఆయా సెంటర్లల్లో సుమారు 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నందున ఎప్పడికప్పుడే తేమ శాతం చూసి కొనుగోలు చేస్తున్నాం. ఇంకా కోతలు కూడా పూర్తి కానుందున రైతులు సెంటర్లకు తెచ్చిన ప్రతి గింజా కొనుగోలు చేసే విదంగా చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 35,120 మంది రైతుల నుంచి రూ.464.1కోట్ల విలువైన ధాన్యం కొన్నాం.
-హరీశ్, సివిల్ సైప్లె డీఎం, నల్లగొండ