నల్లగొండ ప్రతినిధి, జనవరి 20 (నమస్తే తెలంగాణ) ; ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకూ రూ.2 లక్షల రుణమాఫీని, ప్రతి ఎకరాకూ రూ.7,500 రైతుభరోసాను వర్తింప చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకు నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ మంగళవారం తలపెట్టిన కేటీఆర్ రైతు మహాధర్నాపై ప్రభుత్వం కక్ష కట్టింది. క్లాక్‌టవర్ సెంటర్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా కొత్త సాకులను తెరపైకి తెస్తూ కేటీఆర్ మహాధర్నాకు పోలీసు శాఖ అనుమతి నిరాకరించింది. దాంతో బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒత్తిళ్లతోనే పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. దశాబ్దాల తరబడి ఇదే క్లాక్‌టవర్ సెంటర్… వేలాది నిరసనలు, ఆందోళనలు, ఆమరణ దీక్షలు, రోజుల తరబడి నిరహార దీక్షలకు వేదికగా ఉంటూ వస్తున్నదని గుర్తు చేస్తున్నారు.
గతం కంటే క్లాక్‌టవర్ సెంటర్ బీఆర్ఎస్ హయాంలోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన కోట్లాది రూపాయల నిధులతో చాలా విశాలంగా, సుందరంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. అలాంటి క్లాక్‌టవర్ సెంటర్ ప్రస్తుతం చాలా ఇరుగా ఉందని, రోడ్లు చిన్నగా ఉన్నాయని, ట్రాఫిక్ డైవర్షన్‌కు అవకాశం లేదని కారణాలు చూపుతూ ధర్నాకు అనుమతివ్వలేమని పోలీసులు చెప్పడం ఏంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేవలం కేటీఆర్ వస్తున్నారని, రైతుల పక్షాన పోరాటానికి దిగుతున్నారని సీఎంకు, మంత్రులకు భయం పట్టుకునే ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా, న్యాయస్థానాలను ఆశ్రయించి కొంత ఆలస్యమైనా నల్లగొండ వేదికగా రైతు మహాధర్నా జరిపి తీరుతామని స్పష్టం చేశారు.
నల్లగొండ క్లాక్‌టవర్ వేదికగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు ప్రభుత్వం మోకాలడ్డింది. వాస్తవంగా ఈ నెల 12వ తేదీనే మహాధర్నా నిర్వహించాలని భావించి పోలీసు శాఖకు అనుమతి కోరింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో రద్దీ, ప్రయాణాలు తదితర కారణాలతో పండుగ తర్వాత పెట్టుకోవాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఙప్తితో పాటు పండుగ పూట ప్రజలకు కూడా అసౌకర్యం కలుగకూడదని ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ ధర్నాను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు జిల్లా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ జిల్లా నేతలు రైతు మహాధర్నా ఏర్పాట్లపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ నల్లగొండ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్ ఈ నెల 17న సాయంత్రం రైతు మహాధర్నాకు అనుమతి కోరుతూ నల్లగొండ డీఎస్పీకి దరఖాస్తు చేశారు. క్లాక్‌టవర్ వేదికగా రైతు ధర్నా నిర్వహిస్తామని, దీనికి కేటీఆర్ హాజరవుతారని అందులో పేర్కొన్నారు.
మర్నాడు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్‌ను కలిసి ధర్నా గురించి వివరించి అనుమతి ఇవ్వాలని కోరింది.అయినా సరే సోమవారంం ఉదయం11గంటల తర్వాత ఉన్నట్టుండి కేటీఆర్ పాల్గొననున్న రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అప్పటికే జిల్లా నేతలంతా మహాధర్నా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా రైతులు తరలివచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లపై దృష్టి సారించారు. నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నేతృత్వంలో మహాధర్నా ఫ్లెక్సీలు, కౌటట్లు, ఇతర ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈ దశలో పోలీసులు పలు కారణాలు చూపుతూ మహాధర్నాకు అనుమతి ఇవ్వలేమని తెలిపారు. సోమవారం తన పర్యటనలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండకు వచ్చిన అనంతరం ఇలా చెప్పారు. నల్లగొండలోని రైతుధర్నా ఫ్లెక్సీలు, హోర్డింగులు, కటౌట్లను చూసి మంత్రి కోమటిరెడ్డి జీర్ణించుకోలేక పోయినట్లు తెలిసింది. ఆయనే పోలీసులపై ఒత్తిడి తెచ్చి అనుమతి ఇవ్వకుండా చేశారని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆరోపించారు.
క్లాక్‌టవర్ సెంటర్ చాలా ఇరుకట!
నల్లగొండ క్లాక్‌టవర్ చాలా ఇరుకైందని, రోడ్లు చిన్నగా ఉన్నాయని, కేటీఆర్ రైతు మహాధర్నాకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తారని, దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందంటూ కారణాలను చూపి పోలీసు శాఖ అనుమతి నిరాకరించింది. రద్దీ జంక్షన్ అని, క్లాక్‌టవర్ సెంటర్‌కు వచ్చే ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయడానికి అల్టర్నేట్ రోడ్లు లేవని మరో కారణం చూపారు. ఇలా పలు సాకులతో పోలీసులు అనుమతిని నిరాకరించడంపై బీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్లాక్‌టవర్ సెంటర్ వేదికగానే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిరసన, ఆందోళనలు నిర్వహించడం దశాబ్దాల నుంచి ఆనావాయితీగా వస్తున్నది. గతంలో ఇప్పటి కంటే చాలా తక్కువ విస్తీర్ణంలో ఉన్న క్లాక్‌టవర్ సెంటర్లో అనేక ధర్నాలు, నిరసనలు, నిరాహార దీక్షలకు పోలీసులు అనుమతులు ఇచ్చేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం టెంట్లలోనే క్లాక్‌టవర్ సెంటర్ తెల్లవారేది.
నెలల తరబడి ఆందోళనలు జరిగేవి. ఎంత పెద్ద లీడర్ వచ్చినా ప్రసంగాలు సాగేవి. ప్రతిపక్షంలో ఉండగా ప్రస్తుత డిప్యూటీ సీఎం చేసిన పాదయాత్ర సభ కూడా ఇదే క్లాక్‌టవర్ సెంటర్లో జరిగింది. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా చేసిన నిరుద్యోగ సదస్సుకు ఇదే క్లాక్‌టవర్ సెంటర్ వేదికగా మారగా ప్రస్తుత మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వంటి కాంగ్రెస్ నేతలంతా పాల్గొన్నా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలాంటి క్లాక్‌టవర్ సెంటర్ ప్రస్తుతం ఇరుగ్గా మారిందని చెప్తుండడం విస్మయం కలిగిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు మండి పడుతున్నారు. గతేడాది నవంబర్ 29న బీఆర్ఎస్ దీక్షా దివస్ సైతం ఇక్కడే వేలాది మందితో నిర్వహించారు. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా కార్యక్రమం సాగిందని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం కేటీఆర్ రైతు మహాధర్నాకు మాత్రమే అనేక అభ్యంతరాలను తెరపైకి తేవడం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యనేనని అంటున్నారు.
రైతుల ఆగ్రహంతో కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయం ; తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్
గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చల్లని చూపుతో రైతులు సంతోషంగా ఉండగా, మాయదారి కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయని తుంగతుర్తి మాజీ ఎమ్మె ల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులతో పెట్టుకున్న ఏ పార్టీ ప్రభుత్వం కూడా మనుగడలేకుండా పోయిందని, అలాగే రైతుల ఆగ్రహంతో ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం మాడి మసైపోవడం ఖాయమని అన్నారు. కేటీఆర్‌ను చూస్తేనే రేవంత్‌కు వణుకు పుడుతుందని, అందుకే ధర్నాలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో పోలీసులతో ప్రతిపక్షాలను ఏనాడూ వేధింపులకు గురిచేయలేదని, కానీ నేడు పోలీసులను అడ్డుపెట్టుకొని రేవంత్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని దుయ్యబట్టారు.
హైకోర్టు ఆదేశాల మేరకు…
పోలీసులు అనుమతి నిరాకరణ వెంటనే బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్ పేరుతో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం సాయంత్రం విచారించిన హైకోర్టు దీనిపై విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు రైతు మహాధర్నాకు అనుమతి వస్తుందని, త్వరలోనే ధర్నా నిర్వహించి తీరుతామని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు.
రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్
రాష్ట్రంలో రైతు వ్యతిరేక కాంగ్రెస్ పాలన నడుస్తున్నదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. రైతులకు చేసిన మోసాలకు ఎండగడుతూ నేడు నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన రైతు మహా ధర్నా పోలీసులు అనుమతించక పోవడం వల్ల వాయిదా పడినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా ధర్నాను అడ్డుకుందని, త్వరలోనే మహా ధర్నా నిర్వహించే తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.