వరంగల్ రైతు డిక్లరేషన్, ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ఏడాదికి రూ.15వేల రైతుభరోసా హామీని తుంగలో తొక్కడం వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది డిసెంబర్లో అధికారంలోకి రాగానే యాసంగి రైతు భరోసాను రూ.7,500 ఇస్తానని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన విషయం తెలిసిందే. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పడంతో నాటి నుంచి రైతులు పెట్టుబడి సాయం కోల్పోతూనే ఉన్నారు. గత యాసంగిలో రూ.7,500 చొప్పున కాకుండా
కేసీఆర్ సర్కారు మాదిరిగానే రూ.5వేలతో సరిపెట్టారు. ఆ తర్వాత వానకాలం సీజన్లో మొత్తానికే ఎగనామం పెట్టారు. ప్రస్తుత యాసంగిలో రైతుభరోసాను రూ.6వేల ఇస్తామని నింపాదిగా ప్రకటించారు. ఇలా మొత్తం మూడు సీజన్లలో కలిపి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం పరిశీలిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి రేవంత్‌రెడ్డి సర్కారు దాదాపు రూ.3వేల కోట్లు బాకీ పడినైట్లెంది. కాంగ్రెస్ ప్రభుత్వ మోసంపై రైతులు మండిపడుతున్నారు. సోమవారం ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్ సర్కార్ హయాంలో చివరిసారిగా 2023 వానకాలంలో రైతుబంధు అమలు చేశారు. అది వరుసగా 11వ సీజన్ పంట పెట్టుబడి సాయం అవడం విశేషం. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాలో సుమారు 26 లక్షల ఎకరాలకు సంబంధించిన 11 లక్షల మంది రైతులకు రూ.1,250 కోట్లను అందించారు. అదే ఏడాది ఎన్నికల సమయంలోనూ యాసంగి రైతుబంధు అమలుకు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధం కాగా, కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఆ సీజన్లో సైతం 1,300 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కానీ కల్లబొల్లి, మోసపూరిత వాగ్థానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
రైతులంతా ఎన్నికల్లో చెప్పినట్లుగా రూ.7,500 పెట్టుబడి సాయంగా అందుతుందని ఆశ పడ్డారు. కానీ వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుక మడత వేయడంతో ఆశలు ఆడియాశలయ్యాయి. దాంతో ఆ సీజన్లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే ఎకరాకు రూ.5వేలు మాత్రమే ఇచ్చారు. అందులోనూ కొందరికి ఎగ్గొట్టారు. వానకాలం సీజన్ నుంచి అందరికీ ఇస్తామని చెప్పి అప్పటివరకు తప్పించుకోగలిగారు. వానకాలం సీజన్ మొదలైన నాటి నుంచి కొత్త డ్రామాలు మొదలుపెట్టి సబ్ కమిటీ ఏర్పాటు, అభిప్రాయ సేకరణ వంటి సాకులతో సీజన్ అంతా కాలయాపన చేశారు. ఇంతలో యాసంగి సీజన్ రానే వచ్చింది. వానకాలం సీజన్ రైతుభరోసా గురించి వదిలేసి యాసంగికి ఇస్తామంటూ కొత్త పల్లవి మొదలుపెట్టారు. దీన్ని కూడా సాగదీస్తూ చివరకు రూ.6వేల ఇవ్వగలమని చావు కబురు చల్లగా చెప్పారు. ఇలా మొత్తంగా మూడు సీజన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎగనామం పెట్టిన రైతుభరోసా విలువ ఉమ్మడి జిల్లాలో రూ.3వేల కోట్లుగా ఉండడం గమనార్హం.
గత యాసంగిలో రూ.650 కోట్లు
గత ఏడాది యాసంగిలో ఎకరాకు రూ.7,500 రూపాయల చొప్పున ఇచ్చి ఉంటే ఉమ్మడి జిల్లా రైతులకు రూ.1,950 కోట్ల పంట పెట్టుబడి సాయంగా అందాల్సి ఉంది. కానీ కేసీఆర్ సర్కార్ మాదిరిగానే రూ.5వేల చొప్పున ఇవ్వడంతో రూ.1,300 కోట్లకు అటూఇటూగానే రైతులకు అందింది. దాంతో ఒక్కో ఎకరం మీద రైతులు రూ.2500 నష్టపోయారు. ఇలా ఉమ్మడి జిల్లా రైతులందరికీ కలిపి సుమారుగా రూ.650 కోట్లను ప్రభుత్వం ఎగనామం పెట్టినట్లు స్పష్టమవుతున్నది. జరిగిన జరిగింది అనుకుంటే గత వానకాలంలో రైతుభరోసా ఊసే ఎత్తలేదు. పెద్ద రైతులకు, ఉద్యోగులకు, ఐటీ చెల్లింపుదారులకు, పెన్షనర్లకు పెట్టుబడి సాయం అక్కర లేదంటూ…. భూమి విస్తీర్ణానికి పరిమితి విధిస్తామంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీ అభిప్రాయాల సేకరణ పేరుతో కొన్ని జిల్లాల్లో పర్యటించింది. ఇలా వివిధ రకాలుగా కాలయాపన చేస్తూ వచ్చారు. తీరా వానాకాలం సీజన్ ముగింపునకు వచ్చే సరికి రైతుభరోసాపై చేతులెత్తేశారు.
ఈ యాసంగిలో రూ.400 కోట్ల కోత
ఈ నెల 26 నుంచి యాసంగి రైతుభరోసాను అమలు చేస్తామని శనివారం నాటి క్యాబినేట్లో నిర్ణయం చేశారు. కాగా, ముందు చెప్పినట్లు రూ.7,500 కాకుండా ఎకరాకు 6వేల రూపాయలే ఇస్తామని ప్రకటించారు. దాంతో ఒక్కో ఎకరంపై రైతులు రూ.1,500 రూపాయల పెట్టుబడి సాయాన్ని కోల్పోవాల్సి వస్తున్నది. దీని వల్ల ఉమ్మడి జిల్లా రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయంలో సుమారు రూ.400 కోట్లకు కోతపడినైట్లెంది. సాగు యోగ్యం కాని భూముల ఎరివేత పేరుతో మరింత కుదించేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇలా ఎంత వీలైత అంత కోత పెట్టేందుకు ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుండడంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. రేవంత్ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్దఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. ఎకరాకు ఏడాదికి రూ.15వేల పెట్టుబడి సాయం ఇవ్వకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
వానకాలంలో రూ.1,950 కోట్లు
గత వానకాలం సీజన్లో కేసీఆర్ సర్కారు నాటి లెక్కల ప్రకారం చూస్తే ఉమ్మడి జిల్లాలోని 26లక్షల ఎకరాలకు గానూ 11 లక్షల మంది రైతులకు రైతుభరోసా అందాలి. కాంగ్రెస్ చెప్పిన ప్రకారంగా ఒక్కో సీజన్‌కు రూ.7,500 చొప్పున లెక్కేస్తే ఉమ్మడి జిల్లా రైతులకు సుమారుగా రూ.1,950 కోట్లు పెట్టుబడి సాయంగా దక్కాలి. కానీ ఆ సీజన్లో రైతుభరోసాకు మొత్తానికే ఎగనామం పెట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 వానకాలం నుంచి రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టి నిరాటంకంగా అమలు చేస్తూ వచ్చారు. వరుసగా 11 సీజన్లలో సాగుతో సంబంధం లేకుండా పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్న ప్రతి రైతు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేశారు. ఇలా మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల ఖాతాల్లో రూ.11,700 కోట్లు రైతుబంధు డబ్బులు పడ్డాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మొత్తం పథకాన్నే నిలిపివేసి రైతులకు మొండి చేయి చూపింది.