– ఫర్టిలైజర్ యాప్ను రద్దు చేయాలి
– మొదటి జోన్ పరిధిలో నీరు విడుదల చేయాలి
– రైతు బంధు సమితి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
మిర్యాలగూడ, ఆగస్టు 22 : రైతు బీమా చెల్లించి పేద రైతు కుటుంబాలకు ఆదుకోవాలని నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి, మిర్యాలగూడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మిర్యాలగూడలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 70 లక్షల పైగా రైతులు ఉన్నారని, రైతు భరోసా కింద వారందరి పేరుమీద ప్రీమియం ప్రభుత్వం చెల్లించవలసి ఉందన్నారు. ప్రీమియం గడువు ఆగస్టు 13 వరకు ముగిసిందని, ప్రభుత్వం రెన్యువల్ ప్రీమియం ప్రతి రైతుకు రూ.3,869 చెల్లించవలసి ఉందని, పాస్ బుక్ ఉన్న రైతులకు రైతు బీమా ప్రీమియం సుమారు రూ.2,700 కోట్లు చెల్లిస్తే రైతు బీమా రైతులకు అందుతుందన్నారు. మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి చెందిన ఒక ఎకరం గల గిరిజన రైతు చందు నాయక్ (40) అనారోగ్యంతో ఆగస్టు 18న మృతి చెందాడని అతనికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా ప్రీమియం రెన్యువల్ చేయకపోవడంతో పేద రైతు చందు నాయక్ కుటుంబానికి రైతు బీమా అందక కుటుంబం రోడ్డుపై పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
59 సంవత్సరాల్లోపు రైతులలో ఎవరైనా రైతు మృతి చెందినట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బీమా ఆ కుటుంబానికి రూ.5.లక్షలు 10 రోజుల్లో అందజేశారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని విమర్శించారు. రైతుల పేరిట ప్రీమియం చెల్లించవలసిన గడువు ఆగస్టు 13న ముగిసినప్పటికీ నేటి వరకు రెన్యువల్ ప్రీమియం చెల్లించకపోవడంతో ఇటీవల మృతి చెందిన పేద రైతు కుటుంబాలకు రైతు బీమా అందక అనేక అవస్థలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆదుకునేందుకు, రైతుల శ్రేయస్సు కోసం రూ.5 లక్షలు పేద రైతు కుటుంబాలకు అందించాలని కోరారు. ప్రభుత్వం రైతుల భీమా ప్రీమియం చెల్లించి రెన్యువల్ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో కేసు నడుస్తుందని, ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులు హైకోర్టుకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని ఆయన ఆరోపించారు. చాలామంది నిరక్షరాసులైన రైతులకు యాప్ వినియోగించే విధానం తెలియదని, స్మార్ట్ ఫోన్లు లేవని, యాప్ రద్దు చేయాలని కోరారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ ను ప్రవేశపెట్టిందని, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను విరమించుకొని ఫర్టిలైజర్ యాప్ ను రద్దు చేయాలని, యాప్ ల వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 530 అడుగుల నీరు ఉన్న సమయంలో రైతుల కోసం సాగర్ ఎడుమ కాలువకు నీరు విడుదల చేశామని, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు తీసుకొని, చెరువులను నింపాలని, మొదటి జోన్ పరిధిలోని తడకమళ్ల రెగ్యులేటర్ వరకు నీరు విడుదల చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై ఉమ్మడి నల్లగొండ జిల్లా చెందిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదని, 10 గంటలు కరెంటు సరఫరా అవుతుందని, సరఫరాలలో సక్రముగా జరగడం లేదన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జంకు తండా గ్రామ మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్, ట్యాంకు తండ సర్పంచ్ వెంకటేశ్వర్లు, సర్పంచ్ మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.