తిరుమలగిరి, ఆగస్టు 23: సమైక్య రాష్ట్ర పాలనలో కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తుంగుతర్తి నియోజకవర్గం స్వరాష్ట్రంలో సస్యశ్యామలమైంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాం లో సాగునీటి రంగంతో పాటు ప్రాజెక్టుల నిర్మాణంలో నూతన శకం ప్రారంభమైంది. కాళేశ్వరం జలాలతో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా ఇక్కడి రైతాంగానికి సాగునీరు అందించటంతో వెకబాటుకు గురైన తుంగతుర్తి నియోజకవర్గం రూపురేఖలు మారిపోయి బీడు భూములు సిరు ల మాగాణిగా మారాయి. ఈ క్రమంలో తిరుమలగిరి మండంలోని ఎగువన ఏడు గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సమైక్య రాష్ట్రం లో ఏండ్లకు ఏండ్లు ఎదురు చూసినా అడుగు ముందుకు పడని దేవాదుల ప్రాజెక్టు 3వ దశ పనులను చేపట్టి రైతుల కల సాకారం చేసే క్రమంలో.. దేవాదులకు అనుసంధానంగా జనగామ జిల్లాలోని కొండకండ్ల మండలంలోని చెన్నూరు రిజర్వాయర్ నుంచి తిరుమలగిరి మండలంలోని ఎగువన 7 గ్రామాలకు సాగునీరు అందించేందుకు చెన్నూరు రిజర్వాయర్ నుంచి తిరుమలగిరి వరకు 12 కిలో మీటర్ల మే ర ప్రధాన కాల్వ, మూడు డీబీఎంలు నిర్మించి 2023 డిసెంబర్ వరకు పనులు పూర్తి చేసి.. 7 గ్రామాల పరిధిలో 14 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం జరుగుతుండగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సాగు నీటితో పాటు ప్రాజెక్టులకు గ్రహణం పట్టింది.
దేవాదుల ప్రాజెక్టులో భాగంగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం సరిహద్దు జిల్లా జనగాం కొడకండ్ల మండలంలోని చెన్నూరు గ్రామంలో 1800 ఎకరాల్లో రూ.100 కోట్లతో రిజర్వాయర్ నిర్మించారు. దీని నీటి నిల్వ సామర్థ్యం 0.58 టీఎంసీలు, ఒక్క టీఎంసీ 2831,68,46,592 లీటర్లు (శతకోటి ఘనపు అడుగులు) అన్న మాట. దీని కింద 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలి.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజక వర్గాలకు అందించగా చెరువులు, కుంటలు నిండి పుష్కలంగా సాగు నీరు అందింది. ఈ క్రమంలో తిరుమలగిరి మండలంలోని ఎగువ ప్రాంతాలైన నెల్లిబండతండా, తాటిపాముల, నందాపురం, తిరుమలగిరి, మాలీపురం, తొండ, వెలిశాల గ్రామాలకు సాగునీరు అందుతుంది. డీబీఎంలు పూర్తయితే మండలానికి పూర్తిస్థాయిలో సాగునీరు అంది సస్యశ్యామలం కానుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 చివ రి నాటికి ఎగువ ప్రాంతాలకు దేవాదుల ప్రా జెక్టు ద్వారా సాగునీరు అందించాలని మే నెల నాటికి నెల్లిబండ వరకు ప్రధాన కాల్వ పనులు పూర్తయ్యాయి. డిసెంబర్ నాటికి డీబీఎంలు పూర్తి చేసి రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించాలనే సంకల్పం ప్రభుత్వం మారడంతో ఈ ఆశయానికి గ్రహణం పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటినా తట్టెడు మట్టి తీయలేదు. కాల్వల పనులు ముందుకు సాగలేదు. రిజర్వాయర్ పనులు కూడా అసంపూర్తిగా మిగిలాయి. ఇటీవల పనులు ప్రారంభమైనా ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందనంగా సాగుతున్నాయి.
పనులు కొస వరకు సాగుతాయా? ఈ ప్రభుత్వం ఉన్న ప్రాజెక్టులనే ఎండబెడుతున్నది. దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తదని నమ్మకం లేదు. రెండున్నర సంవత్సరాలకు పనులు మొదలు పెట్టినరు. ఎన్ని సంవత్సరాలకు పూర్తి చేస్తరో తెలియదు. కేసీఆర్ ఉంటే మాట మీద నిలబడి పనిచేసి రైతులకు నీళ్లు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం పట్టించుకుంటనే లేదు.
-దేవేందర్, నెల్లిబండతండా, తిరుమలగిరి
పనులు మొదలు పెట్టడం కాదు.. పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలి. ఏదో ఎన్నికలకు ముందు పనులు చేసినట్లు ఉండొద్దు. రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కూడా సాగునీరు అందించాలి. లేకుంటే ఉన్న పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికీ భూమిల జల లేక ఉన్న బోర్లు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది.
-ఎర్రగొల్ల లింగన్న, తొండ గ్రామం, తిరుమలగిరి