సూర్యాపేట, మే 23 (నమస్తే తెలంగాణ) : ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు నమ్మబలికిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే దోఖాబాజీ తనాన్ని ప్రదర్శించింది. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జిల్లా వ్యాప్తంగా 3,82,533 ఎకరాల్లో వచ్చిన తొలి పంటకు బోనస్ ఇవ్వాల్సి ఉండగా.. సన్న రకాలకు మాత్రమే ఇస్తామని ప్రకటించిన విషయం విదితమే.
దాంతో జిల్లాలో 2,08,661 ఎకరాల్లో రైతులు సాగు చేసిన దొడ్డు రకం ధాన్యానికి బోనస్ అందని పరిస్థితి నెలకొంది. అధికారిక లెక్కల ప్రకారమే జిల్లాలో 3,82,518 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం దిగుబడి కాగా, దీనికి రూ.250 కోట్లు బోనస్ ఇవ్వాల్సి ఉన్నది. వాస్తవానికి యాసంగిలో అత్యధికంగా దొడ్డు రకం ధాన్యం సాగు చేస్తుండగా ఈ సీజన్లో దాదాపు 55 శాతంగా నమోదైంది. సన్నాలకు బోనస్ ఇచ్చి దొడ్డు రకాలకు ఇవ్వకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలవికాని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఐదు నెలలు గడుస్తున్నా వాటి అమలుకు చిత్తశుద్ధి చూపించడం లేదు. దశాబ్దాల తరబడి కరువు, కాటకాలతో అల్లాడిన తెలంగాణ ప్రాంతం పదేండ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలతో పచ్చగా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ మరేదో ఇస్తామని చెప్పడంతో ఆశపడి ఆ పార్టీని గెలిపించిన ప్రజలు..
ఇప్పుడు ఎందుకు గెలిపించామా? అని బాధపడుతున్నారు. ఐదు నెలల్లోనే సాగు నీళ్లు బంద్, విద్యుత్ కోతలతో సతమతం కాగా, తీరా పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో సెంటర్ల వద్ద రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో వ్యాపారులకు తక్కువ ధరకే తెగనమ్ముకున్నారు. ఇక రైతాంగానికి బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీతో అది వస్తుందని ఆశపడ్డ రైతాంగానికి నిరాశే మిగిలింది.
జిల్లాలో 3,82,518 ఎకరాల్లో వరి సాగు చేశారు.. ఇందులో పండించిన 45 శాతం సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వనుండగా.. మిగిలిన 55 శాతం పంటకు బోనస్ దక్కని పరిస్థితి. సన్న రకం ధాన్యానికే బోనస్ ఇస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన జిల్లాలో 1,73,872 ఎకరాల్లో 1,10,121 మంది రైతులు ఫైన్ వెరైటీ ధాన్యం పండించగా.. వ్యవసాయ శాఖ అధికారిక లెక్కల ప్రకారం ఎకరానికి 2.2 మెట్రిక్ టన్నుల చొప్పున 3,82,872 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది.
క్వింటాలుకు రూ.500 చొప్పున సన్న ధాన్యం పండించిన రైతాంగానికి బోనస్‌గా రూ.191.40 కోట్లు అందనుంది. కాగా, 1,17,545 మంది రైతులు 2,08,661 ఎకరాల్లో దొడ్డు రకాలు సాగు చేయగా.. ఎకరానికి 2.4 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 5,00,815 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యింది. క్వింటాకు రూ.500 చొప్పున రూ.250 కోట్లు బోనస్ రూపంలో రైతులకు అందాల్సి ఉన్నది. కానీ.. ప్రభుత్వ నిర్ణయంతో దొడ్డు రకం ధాన్యం పండించిన రైతులకు అన్యాయం జరుగనుంది. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్ని రకాల ధాన్యానికి బోనస్ అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఎన్నికల సమయంలో వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు సన్న రకాలకు మాత్రమే ఇస్తామని ప్రకటించడం సరికాదు. కొన్ని భూములు సన్న రకానికి అనుకూలంగా ఉండవు. కాబట్టి దొడ్డు రకం వడ్లనే పండిస్తాం. సర్కారు నిర్ణయంతో దొడ్డు రకం పడించిన రైతులకు నష్టం జరుగుతుంది. ప్రభుత్వం స్పందించి సన్న రకంతోపాటు దొడ్డు రకం వడ్లకు కూడా రూ.500 బోనస్ చెల్లించాలి. లేకుంటే రైతులమంతా అదోళన చేపడుతాం.
యాసంగి వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. తీరా పంట చేతికొచ్చిన తరువాత మాట మార్చడం తగదు. సన్నాలకు మాత్రమే చెల్లిస్తామని తమ మోసపూరిత తత్వాన్ని మరోసారి రుజువు చేస్తూ రైతులను మోసం చేసింది. యాసంగిలో సాగు చేసిన అన్ని రకాల పంటలకు బోనస్ చెల్లించే వరకు ప్రభుత్వంపై పోరాటం తప్పదు.
– పుట్ట కిరణ్, రైతు, గణపవరం, (కోదాడ రూరల్)