నకిరేకల్, ఏప్రిల్ 6 : యాసంగి సీజన్లో వరి కోతలు ప్రారంభమై 15 రోజులు దాటినా నకిరేకల్ మండలంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. మండలంలోని 14 సెంటర్లకు గాను కేవలం 4 సెంటర్లను మాత్రమే ప్రారంభించారు. ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో మొత్తం ఏడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా చీమలగడ్డ-1, చీమలగడ్డ-2, చందుపట్ల, తాటికల్లు కేంద్రాలను ప్రారంభించగా, నెల్లిబండ, మంగళపల్లి, నెల్లిబండ కేంద్రాలను ఇంకా ప్రారంభించలేదు.
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కడపర్తి, బైరెడ్డిగూడెం కేంద్రాలను ఇంకా ప్రారంభించలేదు. ఎన్డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేయగా గోరెంకలపల్లి(దొడ్డు), గొరెంకలపల్లి(సన్నం), ఓగోడు, వల్లభాపురం, నోములలోని కేంద్రాలను ఇంకా ప్రారంభించలేదు. మండల వ్యాప్తంగా ఇంకా పది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంది. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించనేలేదు. వేసవిలో అకాల వర్షాలు వస్తే తమకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి త్వరగా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
వారం రోజుల్లో రూ.12వేలకు పైగా ఖర్చు..
టేకులగూడెం ధాన్యం కొనుగోలు కేం ద్రంలో వడ్లు ఆరబోసి వారం రోజులు అవుతోంది. రోజూ ముగ్గురు కూలివాళ్లతో కలిసి మా ఇంటోళ్లం ముగ్గురం వడ్లు ఆరబోస్తున్నాం. రోజూ కూలివాళ్లకు రూ.18వందలు ఖర్చు అవుతుంది. ఈ వారం రోజుల్లో ఇప్పటివరకూ రూ.12,600 ఖర్చు చేశాం. ధాన్యం కాంటా వేసి కొనుగోళ్లు ప్రారంభించాలి.
-రొడ్డ ముత్తిలింగం, గుడివాడ, కేతేపల్లి మండలం
ఎండలకు తట్టుకోలేపోతున్నం..
మాది నడిగూడెం. మాకు ఐదెకరాల పొలం ఉంది. వరి కోసి మార్కెట్కు వడ్లు తెచ్చి వారం రోజులవుతున్నా ఇప్పటి వరకూ కాంటా వేయట్లేదు. ఎం డలకు తట్టుకోలేక పోతున్నం. రోజూ కూలివాళ్లు ఒక్కొక్కరికీ రూ.600 ఇచ్చి వడ్లు ఆరబోస్తున్నం. చేసిన కష్టం మొత్తం కూలికే పోతోంది. దయచేసి మార్కెట్ తొందరగా ప్రారంభించి వడ్లు కొనాలని అధికారులను వేడుకుంటున్నా.
-తిరుపారి అంజయ్య, నడిగూడెం,నకిరేకల్ మండలం
అకాల వర్షంతో అపార నష్టం
నిడమనూరు, ఏప్రిల్ 6 : నిడమనూరు మండలంలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. రాత్రి 7 గంటల తర్వాత ఉన్నట్టుండి ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఒక్కసారిగా ప్రారంభమైంది. దీంతో మరో నాలుగైదు రోజుల్లో చేతికి వస్తుందనుకున్న వరి పంట నేలవాలింది. కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని వేంపాడు పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టుకున్న రైతులకు ఈ వర్షం విషాదాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా ప్రతాపం చూపిన వాన, కొద్దిసేపటి అనంతరం తెరిపిచ్చి, మళ్లీ దంచి కొట్టడంతో ధాన్యం తడిసి ముద్దయింది.
మిల్లర్ల సిండికేట్ కారణంగా ఇప్పటికే ధర పడిపోయింది. దీంతోపాటు వర్షం పడటంతో మిల్లర్ల పాలిట ఈ వర్షం ..వరంలా మారింది. జోరు వర్షంలో ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు రైతాంగం చేసిన యత్నాలు విఫలమై నిమిషాల వ్యవధిలోనే తడిసి ముద్దవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల ముందస్తుగా వేసిన వరి 15 శాతం మేర చేతికి రాగా, మిగతా పంట మరి కొద్దిరోజుల్లో చేతికి రానుంది. ఈ తరుణంలో గాలి వాన కారణంగా ధాన్యం నేలపాలైంది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.