నల్గొండ రూరల్, జూన్ 11 : నల్లగొండ మండలంలోని తొరగల్లు గ్రామంలో బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కంపసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సమర్థ యూరియా వినియోగం, సమర్థ సాగు విధానం, పంట అవసరాల కొనుగోళ్లలో రసీదులను భద్రపరుచుట, రసాయనాల వినియోగం, అలాగే నూతన వ్యవసాయ పద్ధతులను శాస్త్రవేత్తలు చంద్రశేఖర్, రాములమ్మ వివరించారు.
మండల వ్యవసాయ అధికారి ఎస్.శ్రీనివాస్ మండలంలోని పంటల సరళిని, జీలుగ, జనుము ఉపయోగాలను వివరించారు. ఉద్యాన శాఖ అధికారి పి.అనంతరెడ్డి పండ్ల తోటలు, కూరగాయల సాగు లాభాలు వివరించారు. పతంజలి ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ ఆఫీసర్ ప్రసాద్ ఆయిల్‌పామ్ సాగు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మత్స్య పరిశ్రమ ఆఫీసర్ కిశోర్, ఏఈఓ ఎన్.సత్యనారాయణ, అభ్యుదయ రైతు రామ్ రెడ్డి, కృష్ణారెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.