చిట్యాల, మే 19 : ధాన్యం కొనుగోళ్లలో పభుత్వం విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదన్నారు. సోమవారం చిట్యాలతో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అధ్వానంగా మారాయని, రోజుల తరబడి కాంటాలు లేకుండా కేంద్రాల్లోనే ధాన్యం ఉంటుందని తెలిపారు. భూ భారతి, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అధికారులు రైతులను గాలికి వదిలేశారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల నుంచి లారీల్లో మిల్లులకు వెళ్లిన ధాన్యం దిగుమతి కావాలంటే క్వింటాకు 4 కిలోలు తరుగు పేరుతో దోచుకుంటున్నారన్నారు.
అదునుగా కాంగ్రెస్ నేతలు బోనస్ కోసం పక్క రాష్ర్టాల నుంచి సన్న ధాన్యం తెచ్చి బినామీ రైతుల పేరుతో ఇక్కడి కేంద్రాల్లో విక్రయిస్తున్నారని దుయ్యబట్టారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో వెలుగుచూసిన ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. అకాల వర్షాలతో నకిరేకల్ నియోజకవర్గంలో 900 ఎకరాల్లో నిమ్మ, బతాయి తోటలకు నష్టం వాటిల్లితే ఇప్పటికీ పరిహారం ఊసే లేదని విమర్శించారు. గతంలో పంట నష్టం జరిగినప్పుడు ఎకరాకు రూ.10వేల చొప్పున అందించిన ఘనత కేసీఆర్‌ది అని గుర్తు చేశారు. కాంగ్రెస్ మంత్రులంతా కమీషన్లకు కక్కుర్తి పడి కోట్ల రూపాయలు దండుకుంటున్నారన్నారు.