GT vs RCB : ఐపీఎల్లో కీలకమైన నాకౌట్ సమరానికి మరికాసేపట్లో తెరలేవనుంది. ధర్మశాల వేదికగా క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఢీకొడుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో అదరగొట్టిన ఆర్సీబీ టైటిల్ నిలబెట్టుకోవాలనే కసితో ఉండగా.. తన కెప్టెన్సీలో గుజరాత్‌కు ట్రోఫీ కట్టబెట్టాలని శుభ్‌మన్ గిల్ ఆరాటపడుతున్నాడు. లీగ్ దశలో దుమ్మురేపిన ఈ రెండు జట్లు చెరో నాలుగు విజయాలతో సమఉజ్జీలుగా నిలిచాయి. వర్షం అంతరాయం కలిగించే అవకాశమున్న మ్యాచ్‌లో విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లేది ఎవరు? అనేది ఉత్కంఠ రేపుతోంది.
పంతొమ్మిదో సీజన్లో క్వాలిఫయర్ 1 పోరు ఆసక్తి రేపుతోంది. లీగ్ దశను 18 పాయింట్లతో ముగించిన ఆర్సీబీ, గుజరాత్ మధ్య ధర్మశాలలో కాసేపట్లో బిగ్ ఫైట్ జరుగనుంది. బలాబలాల పరంగా సమానంగా కనిపిస్తున్న ఇరుజట్లు విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లడమే లక్ష్యంగా ఆడనున్నాయి.
లీగ్ దశలో సొంతగడ్డపై చెరొక విజయంతో పట్టునిలబెట్టుకున్న ఆర్సీబీ, గుజరాత్.. ధర్మశాలలో హోరాహోరీ పోరుతో అభిమానులను అలరించడం ఖాయమనిపిస్తోంది. ఇప్పటివరకూ క్వాలిఫయర్ 1లో అత్యధిక స్కోర్ గుజారాత్దే. 2023 సీజన్లో ముంబై ఇండియన్స్‌పై 233/3 కొట్టిన గుజరాత్.. ఈసారి బెంగళూరుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశముంది. ఇరుజట్ల మధ్య ఇదే తొలి క్వాలిఫయర్ 1 కావడం విశేషం.
One win each in the head-to-head this season – who comes out on top in Dharamsala tonight?#RCBvGT #IPL2026 pic.twitter.com/ApaO0BrlHl
— ESPNcricinfo (@ESPNcricinfo) May 26, 2026
ఆరంభ సీజన్ నుంచి తొలి టైటిల్ కోసం 18 ఏళ్లు నిరీక్షించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) రెండో ట్రోఫీని పట్టేయాలని ఉవ్విళ్లూరుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా 19వ సీజన్లో అడుగు పెట్టిన ఆర్సీబీ.. టాపార్డర్ విధ్వంసం, స్వింగ్ కింగ్ భువనేశ్వర్ విజృంభణతో 9 విజయాలతో టాప్‌లో నిలిచింది.
చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓడినా.. రన్‌రేటులో గుజరాత్‌ను రెండో స్థానానికే పరిమితం చేసింది. ప్రతిసీజన్‌లో కుర్రాడిలా చెలరేగే విరాట్ కోహ్లీ(557 పరుగులు) ఎప్పటిలానే ఈసారి పరుగుల వరద పారిస్తుండగా.. మూడో స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్‌లతో బెంగళూరు విజయాల్లో కీలకమవుతున్నారు.

ఫిల్ సాల్ట్ తిరిగి జట్టుతో కలవడంతో ఓపెనింగ్ జోడీపై ఆర్సీబీ ఆలోచనల్లో పడింది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వెంకటేశ్ అయ్యర్ రాణించ డమే అందుకు కారణం. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా(73, ముంబై ఇండియన్స్‌పై), టిమ్ డేవిడ్(70, చెన్నై సూపర్ కింగ్స్‌పై )లు ఒకట్రెండు మ్యాచుల్లో మెరిశారు. బౌలింగ్‌లో భువనేశ్వర్ పవర్ ప్లేలో నిప్పులు చెరుగుతున్నాడు.
స్వింగ్‌తో బెంబేలెత్తిస్తున్న భువి 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో ముందున్నాడు. క్వాలిఫయర్ 1లోనూ ఈ సీనియర్ పేసర్ కీలకం కానున్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తున్న హేజిల్‌వుడ్, యశ్ దయాల్ లేని లోటును భర్తీ చేస్తున్న యువ పేసర్ రసిక్ దార్ సలాం, స్పిన్నర్ సుయాశ్ శర్మ రాణించాలని ఆర్సీబీ కోరుకుంటోంది.
అరంగేట్రం సీజన్ 2022లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఐపీఎల్ ట్రోఫీని ఒడిసిపట్టిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) రెండో కప్‌ను తన్నుకుపోవాలనే కసితో ఉంది. 2023లో ఫైనల్ చేరినా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో కంగుతిన్న గుజరాత్ ఈసారి కెప్టెన్ శుభ్‌మన్ గిల్(616 పరుగులు) సారథ్యంలో గొప్ప ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరింది. సాయి సుదర్శన్(638 పరుగులు)తో కలిసి శుభారంభాలిస్తున్న గిల్ బ్యాటింగ్ యూనిట్‌కు వెన్నెముకలా నిలుస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఇద్దరూ తొలిరెండు స్థానాల్లో ఉన్నారంటే ఏ స్థాయిలో చెలరేగుతున్నారో అర్థమవుతుంది.

ఈ సీజన్లో గుజరాత్ గిల్, తమిళ తంబీపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. మిడిలార్డర్లో బట్లర్ .. సుందర్ మాత్రమే రాణిస్తుండడం గుజరాత్‌ను కొంత కలవరపరుస్తోంది. బౌలింగ్ యూనిట్లో కగిసో రబడ(24 వికెట్లు) నిప్పులు చెరుగుతున్నాడు. సిరాజ్ జతగా కొత్త బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెడుతున్నాడు.
టెస్టు బౌలర్లైన ఈ ఇద్దరూ లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తూ గుజరాత్ గెలుపు గుర్రాలుగా అవతరించారు. ఆల్‌రౌండర్‌గా జేసన్ హోల్డర్ నూరుపాళ్లు న్యాయం చేస్తుండగా, మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ (19 వికెట్లు) మళ్లీ లయ అందుకోవడంతో ఆర్సీబీ బ్యాటర్లకు కష్టాలు తప్పకపోవచ్చు.