Nagaraju Gurrala | జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సౌతాఫ్రికా BRS NRI శాఖ నాయకుడు నాగరాజు గుర్రాల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నేను కూడా అదే డిపోలో పనిచేసి రిటైర్ అయిన ఆర్టీసీ డ్రైవర్ కుమారుడిని. ఒక డ్రైవర్ ఉద్యోగం ఎంత విలువైనదో, ఆ ఉద్యోగం మీద ఒక కుటుంబం ఎలా ఆధారపడి ఉంటుందో నాకు బాగా తెలుసునన్నారు.
ఒక ఆర్టీసీ ఉద్యోగి జీతం వెనుక పిల్లల చదువులు ఉంటాయి.. ఇంటి అద్దె ఉంటుంది.. వృద్ధ తల్లిదండ్రుల మందులు ఉంటాయి.. కుటుంబం మొత్తం భవిష్యత్తు ఉంటుంది. అలాంటి ఉద్యోగాన్ని ఒక ప్రశ్న అడిగాడనే కారణంతో తీసేయడం చాలా కఠినమైన చర్య. డ్రైవర్ అశోక్ ఎవరినీ అవమానించలేదు, ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. రైతుల వడ్లు కొనాలని మాత్రమే కోరారు. రైతు సమస్య గురించి మాట్లాడటం తప్పు కాదు అది సమాజం పట్ల బాధ్యత.
ఒక ఉద్యోగిని విధుల నుంచి తొలగించడం అనేది కేవలం ఒక వ్యక్తిపై చర్య కాదు. ఆ కుటుంబం మొత్తాన్ని మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయడం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉండాలి. ప్రజల సమస్యలను చెప్పినందుకు ఉద్యోగాలు పోయే పరిస్థితి రావడం మంచిది కాదు. అశోక్‌కు ఇచ్చిన రిమూవల్ లెటర్‌ను వెంటనే వెనక్కి తీసుకుని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానన్నారు నాగరాజు గుర్రాల.