నల్లగొండ రూరల్, జనవరి 29 : నల్లగొండ మండలంలోని చిన్న సూరారం గ్రామంలో వరిలో ఆరు తడి విధానంలో సెన్సార్ల వినియోగం, ఆధునిక వరి సాగు పద్ధతులపై రైతులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా నీటి పొదుపు పద్ధతులు, శాస్త్రీయ సాగు విధానాలపై రైతులకు వివరించారు. ఈ సందర్భంగా రత్నాకర్ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగులో సాంకేతికత ఎంతో అవసరమన్నారు. ఈ సెన్సార్లు నేలలో తేమ స్థాయిని కొలిచి, పంటకు ఎప్పుడు నీరు ఇవ్వాలో సూచిస్తాయని వివరించారు. ఈ విధానం ద్వారా అనవసరంగా నీటిని వృథా చేయకుండా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని, దిగుబడులు తగ్గకుండా ఉత్పత్తి పెరుగుతుందన్నారు.
కల్టీవేట్, బెంగళూరుకు చెందిన అనిల్ కుమార్ శాస్త్రీయ వరి సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. భూమి సిద్ధం చేయడం, నాణ్యమైన విత్తనాల ఎంపిక, వరుసలుగా నాటడం, సమతుల్య ఎరువుల వినియోగం, సమగ్ర పురుగుల నివారణ పద్ధతుల గురించి వివరించారు. ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తే ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో రైతులకు వరి సాగులో నీటి వినియోగాన్ని ఎలా తగ్గించుకోవచ్చో, పంట దిగుబడులపై ప్రభావం లేకుండా ఎలా సాగు చేయాలో అవగాహన కల్పించారు. అలాగే స్థిరమైన వ్యవసాయం వల్ల నీటి వనరుల సంరక్షణ, నేల సారవంతం పెరగడం, రైతుల ఆదాయం మెరుగుపడటం వంటి ప్రయోజనాలు ఉంటాయని వక్తలు వివరించారు.
గ్రామానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి రైతుల నుండి మంచి స్పందన లభించింది. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు రైతులను ఆధునిక వ్యవసాయ సాంకేతికతల వైపు ప్రోత్సహించడంలో ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్లో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి రైతులకు మరింత తోడ్పాటు అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ కోఆర్డినేటర్ పల్లవి, నరసింహ, జానయ్య, నవీన్, వెంకన్న, సైదులు, వీరమ్మ పాల్గొన్నారు.