నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ రుణాలకు సంబంధించిన 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెట్టడంతో అర్హుల్లో సగం మంది రుణమాఫీకి దూరమైన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన హామీ ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 6లక్షల మంది రుణమాఫీకి అర్హులుగా రైతులు ఉంటారన్నది అంచనా. కానీ రేషన్‌కార్డు ప్రమాణికంగా కుటుంబానికి గరిష్టంగా 2లక్షల రుణమాఫీని వర్తింప చేయడం వల్ల చాలా మందికి మాఫీ కాలేదు. ప్రభుత్వం లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 3.39లక్షల మంది రైతులకే రుణమాఫీ అయ్యింది. దాంతో మరో రెండున్నర లక్షల మందికి పైగా రైతులు రుణమాఫీ కాక తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వారంతా తమకు రుణమాఫీ ఎందుకు కాలేదంటూ వ్యవసాయ శాఖ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ రోజూ ప్రదక్షిణ చేస్తున్నారు. కాగా, రుణమాఫీ తొలిదశలోనే సగం మంది రైతులకు మాఫీ జరుగలేదన్న విమర్శల నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దశల వారీగా మండల వ్యవసాయ శాఖ కార్యాలయాల్లోనూ గ్రీవెన్స్ సెల్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. అన్నిచోట్లా ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆధార్ నెంబర్ ఆధారంగా కొందరికి ఎందుకు రుణమాఫీ కాలేదో అధికారులు తెలియజేస్తున్నా… తదుపరి ఏం చేయాలనే దానిపై మాత్రం స్పష్టత కరువైంది. ఇప్పటివరకు ఒక్క నల్లగొండ జిల్లాలోనే ఆరు వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు.
రుణమాఫీ కొర్రీలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండడంతోపాటు రైతులు రోడ్లెక్కుతుండడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు ఆదేశించింది. రుణమాఫీ కాని రైతులు స్థానిక వ్యవసాయ అధికారులను కలిసి మరోసారి తమ ధ్రువీకరణ పత్రాలు అందించాలని సూచించింది. దాంతో రుణమాఫీకి దూరమైన రైతులంతా వారం నుంచి అదే పనిలో ఉన్నారు. రెండు లక్షలకుపైగా రుణం ఉన్న రైతులు మరోసారి తమ పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంకు లోన్ అకౌంట్ తాజా స్టేట్మెంట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిర్సాక్స్తోపాటు ఒక దరఖాస్తు ఫారమ్‌ను నింపి మండలాల్లోని ఏఈఓలకు అందిస్తున్నారు. లోన్ స్టేట్మెంట్ కోసం ముందుగా బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూర్.ఎం వంటి చోట్ల బ్యాంకర్లు రైతులకు టోకెన్లు ఇచ్చి రోజుకు 30 నుంచి 40 మందికి మాత్రమే అవకాశం ఇస్తున్నారు. ఆ తర్వాత సంబంధిత నమూనాలో దరఖాస్తులు అందజేస్తున్నా ప్రభుత్వ తదుపరి ఉత్తర్వుల ప్రకారమే రుణమాఫీ జరుగుతుందని అధికారులు చెప్తుండడం గమనార్హం. రేషన్‌కార్డు లేక రుణమాఫీకి దూరంగా ఉన్న రైతులు కూడా ఇదే తరహాలో తమకు రేషన్‌కార్డు లేదన్న విషయాన్ని తెలియజేస్తూ దరఖాస్తులు సమర్పిస్తున్నారు. దాంతోపాటు ఒకే రేషన్ కార్డులో ఉన్న వారి కుటుంబాల్లోనూ రూ.2లక్షలకు పైగా లోన్ ఉంటే వారికి రుణమాఫీ కాలేదు. వారితోపాటు ఆధార్ నెంబర్లో లేదా బ్యాంకు అకౌంట్ నెంబర్లో తప్పు ఎంట్రీ ఉన్న వారికి రుణమాఫీ కాలేదు. ఇలాంటి అనేక కారణాలతో రుణమాఫీకి దూరంగా ఉన్న రైతులంతా ప్రస్తుతం అధికారులు, బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తున్నది. శనివారం నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం వద్ద గ్రీవెన్స్ సెల్‌కు వచ్చిన రైతులు భేషరతుగా అందరికీ రుణమాఫీ చేయాలని నినాదాలు చేశారు.
వినతుల వెల్లువ
ఒక్క నల్లగొండ జిల్లాలోనే శనివారం నాటికి 6వేలకు పైగా రుణమాఫీ కోసం రైతుల నుంచి వినతులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం నాటికి 5,840 దరఖాస్తులు రాగా, శనివారం నాటి వివరాలు అప్డేట్ కావాల్సి ఉందన్నారు. అందులో కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించిన దరఖాస్తులు 1,821, రూ.2లక్షలకు పైగా రుణం ఉన్న వాటిపై 745, నో డేటా అని చూపిన ఖాతాలపై 1,554, ఆధార్ నెంబర్ తప్పుగా ఉన్న ఖాతాలపై 234, పేర్లు సరిపోలని వాటిపై 429, బ్యాంకు వివరాలపై 37, సహకార సంఘాల్లోని వాటిపై 105, పాస్‌పుస్తకాలకు సంబంధించి 467, డెబిట్ సమస్యలపై 154, ఇతర కారణాల మీద 294 దరఖాస్తులు శుక్రవారం నాటికి వ్యవసాయ శాఖకు అందాయి. వీటన్నింటినీ స్క్రూటినీ చేస్తూ తప్పొప్పులను సరిచేసి ఆ వివరాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు వెల్లడించారు. ఇవన్నీ ఎలా ఉన్నా గతంలో కేసీఆర్ సర్కారు మాదిరిగా భేషరతుగా రుణమాఫీని వర్తింప చేస్తే ఈ అవస్థలు ఉండవు కదా అని రైతులు మండిపడుతున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో తమను ఇలా బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిప్పడం న్యాయమేనా అని ప్రశ్నిస్తున్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మీద లేదు. రుణమాఫీ అందరికీ అన్నారు. నాకు మాఫీ కాలేదు. నాకు 38 గుంటల భూమి ఉంది. దాని మీద రూ.52 వేలు పంట రుణం తీసుకున్న. మొదటి విడుత లక్ష లోపు జాబితాలోనే నాకు మాఫీ కావాలి. కాకపోవడంతో బ్యాంకు వెళ్లి అడిగితే రెండో విడుతలో అవుతుందన్నారు. తర్వాత మూడో విడుత అన్నారు. ఏ విడుతలోనూ మాఫీ కాలేదు. పట్టుబట్టి బ్యాంకులో గట్టిగా అడిగితే ఆధార్‌లోని పేరు, ఖాతాలోని పేరు వేరుగా ఉందని. అందుకే రుణ మాఫీ కాలేదని చెప్పారు. ఇది తెలుసుకునేందుకే చాలాసార్లు తిరుగాల్సి వచ్చింది. మళ్లీ అన్ని పత్రాలు ఇచ్చి రుణమాఫీకి కోసం తిరుగుతున్న. పని వదులుకుని ఇట్లా తిరుగడానికే సరిపోతున్నది.
-బాసాని ఉర్మిళ, రైతు, అమ్మనబోలు
ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి
నాకు రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్న. ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంటే దానిపై బ్యాంక్ ఆఫ్ బరోడాలో 75 వేలు, గ్రామీణ బ్యాంకులో లక్షా 90వేలు రుణం పొందాను. ఏ బ్యాంకులోనూ నాకు రుణమాఫీ కాలేదు. ఇదేంటని బ్యాంకు సిబ్బందిని అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదు. వ్యవసాయాధికారులను అడిగితే రెండు బ్యాంకుల్లో రుణం తీసుకుంటే మాఫీ కాదంటున్నారు. ఒక బ్యాంకులోని రుణం మొత్తం కడితే వర్తిస్తుందని చెప్తే బ్యాంక్ ఆఫ్ బరోడాలో తీసుకున్న అప్పు వడ్డీసహా కట్టిన. ఈ విషయం వ్యవసాయ అధికారులకు తెలుపగా త్వరలో రూ.1లక్షా 90వేలు మాఫీ అవుతాయంటున్నారు. దీని కోసం ఇంకెన్ని సార్లు తిరగాలో అర్ధమైతలేదు.
-గోదల వెంకట్‌రెడ్డి, రైతు, నార్కట్‌పల్లి గ్రామం