రామగిరి, నవంబర్ 04 : మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి, వరి పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సిపిఐ జిల్లా కార్యాలయం మగ్దూమ్ భవన్లో మంగళవారం జరిగిన నల్లగొండ నియోజకవర్గ కార్యవర్గ సభ్యుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తడిసిన వరి ధాన్యం, పత్తిని ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతోనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలన్నారు. రైతన్నలు వ్యవసాయ సాగు కోసం వడ్డీలకు అప్పులు తెచ్చి ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో పంటలు తుఫాన్ కారణంగా పూర్తిగా నీటిలో మునిగిపోయి తీవ్ర నష్ట పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వెటనే వ్యవసాయ అధికారులు దెబ్బతిన్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎకరానికి రూ.40 వేలు, పత్తికి ఎకరానికి రూ.60 వేల చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలన్నారు.
డిసెంబర్ 26న ఖమ్మం పట్టణంలో నిర్వహించే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శాతాబ్ది ఉత్సవ ముగింపు బహిరంగ సభకు వేలాదిగా తరలాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. ఈ నెల 17న బహిరంగ సభ ప్రచార జాత నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ప్రవేశించి జిల్లాలో దేవరకొండ, మునుగోడు, నకిరేకల్, నల్లగొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల మీదుగా కొనసాగుతుందని, ఈ జాతాను జయప్రదం చేయాలని కోరారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రక్రియను ముందుకు తీసుకుపోయే క్రమంలో గవర్నర్ కనుసన్నల్లో బిజెపి బిల్లును అడ్డుకుంటుందని విమర్శించారు. కేంద్రంలో బీసీ బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చే వరకు సిపిఐ పోరాడుతుందన్నారు. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బొలుగూరి నరసింహ అధ్యక్షత వహించగా జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, నల్లగొండ పట్టణ కార్యదర్శి కె.ఎస్.రెడ్డి, కనగల్ మండల కార్యదర్శి గంట సత్యనారాయణ, దొటి పండరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి.రామ్ కోటి, నాయకులు జిల్లా యాదగిరి, జోగు సురేందర్, కట్ట వెంకన్న, కట్ట యాదయ్య, పట్టణ సహాయ కార్యదర్శి లెనిన్, ముండ్ల ముత్యాలు, యూసుఫ్, మదర్, కౌసల్య, విజయ, నాగమ్మ, లక్ష్మి, నందన్, అశోక్ పాల్గొన్నారు.