సూర్యాపేట, జనవరి 13(నమస్తే తెలంగాణ) : స్థలం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కూరగాయలు పండించి మధ్యాహ్న భోజనం అందించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. గార్డెనింగ్‌తో పాటు సైన్స్‌లో ఫన్ ఇన్నోవేషన్ ప్రాజెక్టును కూడా చేపడుతూ విద్యార్థులతో సైన్స్ ప్రాజెక్టులను తయారు చేయిస్తారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో వలంటీర్లు గౌరవ వేతనంతో పని చేయాల్సి ఉంటుంది. అయితే ఆ వలంటీర్లకు భవిష్యత్‌లో పర్మినెంట్ ఉద్యోగం దక్కుతుందనే ప్రచారం జరుగుతుండగా అలాంటిదేమీ లేదని, ఉద్యోగ భద్రత గానీ, పర్మినెంట్ పోస్టు గానీ ఉండదని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ స్పష్టం చేశారు. వలంటీర్ల నియామకం అనేది ఆయా పాఠశాలల హెడ్మాస్టర్ల పరిధిలోనే ఉంటుందన్నారు.
ప్రస్తుతం జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో తాత్కాలికంగా వలంటీర్లను తీసుకొని తరువాత పర్మినెంట్ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. దాంతో కొంతమంది అమాయకులు సదరు పోస్టులు దక్కించుకునేందుకు తిరుగుతున్నట్లు సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు పాఠశాలల్లో తాత్కాలిక పోస్టులకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి హైదరాబాద్‌కు చెందిన కేర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ జడ్పీ, కేజీబీవీ, టీఎస్ఎంఎస్ పాఠశాలల్లో న్యూట్రిషన్ గార్డెనింగ్‌తోపాటు సైన్స్‌లో ఫన్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు లను చేపడుతుంది. ఇందుకు గాను వలంటీర్లను నియమించి వారికి రూ. 23 వేల గౌరవ వేతనం చెల్లిస్తారు. అయితే తొలి మూడు నెలలు ప్రొబెషనరీ కాలంగా పరిగణించి రూ. 16 వేలు చెల్లించి తదనంతరం 23 వేల వేతనం అమల్లోకి రానుండగా రెండు వేలు కటింగ్స్ పోను రూ. 21 వేలు స్వచ్ఛంద సంస్థ ఇస్తుందని, ఇది కేవలం టెంపరరీగా కాంట్రాక్ట్ బేసిస్‌లో తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ పోస్టులు పర్మినెంట్ అవుతాయని కొంతమంది రూ. 80 వేల నుంచి రెండున్నర లక్షల వరకు డిమాండ్ చేస్తూ ప్రచారం చేస్తున్నట్లు పేరు బహిర్గతం చేయడానికి నిరాకరించిన ఓ వ్యక్తి పేర్కొన్నాడు.
కేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలల్లో న్యూట్రిషన్ గార్డెనింగ్, సైన్స్‌లో ఫన్ ఇన్నోవేషన్ కార్యక్రమాలు చేపడతారు. ఇందు కోసం వలంటీర్ల నియామకం అనేది కేవలం హెడ్ మాస్టర్ల పరిధిలోనే ఉంటుంది. వలంటీర్లకు విద్యాశాఖకు ఎలాంటి సంబంధం ఉండదు. స్వచ్ఛంద సంస్థ వారే గౌరవ వేతనం ఇస్తారు. వలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో పర్మినెంట్ చేయరు. తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు.
– అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి