పెద్దవూర, ఆగస్టు 31: మండలంలో సాగు చేసిన పంటలకు యూరియా వేయకపోవడంతో పిలకలు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో యూరియా వేయకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత వేధిస్తుండడంతో మండలంలో సైతం రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి.
రైతులు రెండు బస్తాల యూరియా కోసం తెల్లవారుజామున నాలుగైదు గంటల నుంచే పీఏసీఎస్ ఎదుట చెప్పులు, ఆధార్‌కార్డులు పెట్టడంతో పాటు లైన్లో నిల్చుంటున్నా యూరియా దక్కని పరిస్థితి నెలకొంటోంది. ఇదే అదనుగా కొందరు అధికారులు, అక్రమార్కులు పీఏసీఎస్‌లకు వచ్చిన యూరియాను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ చేపట్టాల్సిన ఉన్నతాధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో రైతులకు అందాల్సిన యూరియా దారి మళ్లుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.
డీసీవో విచారణలో నిగ్గుతేలిన నిజాలు
పీఏసీఎస్‌కు వచ్చిన యూరియా రైతులకు అందించకుండా పక్కదారి పట్టాయన్న ఆరోపణలపై ఆగస్టు 29న మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో డీసీవో పత్యానాయక్ విచారణ చేపట్టడంతో నిజాలు నిగ్గుతేలాయి. గత వేసవికాలంలో పీఏసీఎస్‌కు ఎన్ని బస్తాల యూరియా వచ్చింది.. ఎవరికి విక్రయించారో వివరాలు ఇవ్వాలని సీఈవోను ఆదేశించడంతో తాము 51 మంది రైతులకు 742 బస్తాల యూరియాను విక్రయించినట్లు జాబితాను డీసీవోకు అందించారు.
డీసీవో ఆ జాబితాలోని ఓ రైతుకు సంబంధించి ఫోన్ నెంబర్‌కు కాల్ చేసి మీరు ఎన్ని బస్తాల యూరియా కొనుగోలు చేశారని అడగగా నాకు యూరియా అవసరం లేదని, తాను బస్తా యూరియా కూడా తీసుకోలేదని చెప్పడంతో డీసీవో పీఏసీఎస్ సీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు నిజం చెప్పాలని డీసీవో సదరు సీఈవోను నిలదీయడంతో వేసవిలో వ్యవసాయ పనులు అయ్యాక రెండు లారీల్లో 742 బస్తాల యూరియా రాగా అందులో 232 బస్తాలు రైతులకు విక్రయించామని, మిగతా 510 బస్తాల యూరియా గోదాముకు సరైన కిటికీలు లేకపోవడంతో గడ్డలు కట్టడంతో యూరియా పనికిరాకుండా పోతుందని మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణానికి విక్రయించినట్లు తెలిపారు.
మండలంలో సరిపడా యూరియా ఉన్నంక రైతులు ఎందుకు రాస్తారోకో చేస్తున్నారని సీఈవోను అడుగగా ప్రస్తుత వానాకాలం సీజన్లో గత శనివారం, సోమవారం, మంగళవారం, గురువారం రోజుకొకటి చొప్పున నాలుగు లారీల్లో 1,766 యూరియా బస్తాలు రాగా 776 మంది రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.
యూరియా అక్రమాలకు పాల్పడిన సీఈవోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై పీఏసీఎస్ చైర్మన్ స్పందిస్తూ తాను రైతులకు యూరియాను అందించాలనే ఉద్దేశంతో పీఏసీఎస్ కేంద్రానికి తెప్పిస్తే అధికారులు రైతుల ఆధార్‌కార్డులతో వారికి తెలియకుండా ఫర్టిలైజర్ దుకాణానికి విక్రయించడం సిగ్గుచేటని, ఈ విషయంపై మరింత విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు.
రైతులు తెల్లవారుజామునే యూరియా కోసం పీఏఎస్ ఎదుట పడిగాపులు కాస్తున్నా కనికరం లేకుండా పీఏసీఎస్ అధికారులు రైతులకు సరిపడా యూరియా అందించకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యూరియా సరఫరాపై నిఘా ఉంచి రైతులకు సక్రమంగా సరిపడా పంపిణీ చేసి ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.
ఫర్టిలైజర్ దుకాణానికి తరలింపు
మండల కేంద్రంలోని పీఏసీఎస్‌కు ప్రభుత్వం యూరియాను పంపించగా.. దాన్ని రైతులకు అరకొరగా పంపిణీ చేసిన అధికారులు మిగతా బస్తాలను పీఏసీఎస్ చైర్మన్‌కు తెలియకుండానే మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణానికి మళ్లించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. రైతుల ఆధార్‌కార్డులతో వారికి తెలియకుండానే ఫర్టిలైజర్ దుకాణానికి యూరియాను అక్రమంగా తరలించారని తెలిసింది.
యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెబుతున్నా పీఏసీఎస్ అధికారులు అవేమీ పట్టించుకోకుండా స్వలాభం కోసం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. యూరియా సకాలంలో సరిపడా అందకపోవడంతో రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంటోందని రైతులు పేర్కొంటున్నారు.