కాళేశ్వరం జలాల రాకతో సూర్యాపేట జిల్లాలో నీలి విప్లవం ఊపందుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను పునరుద్ధరించగా ప్రస్తుతం అవి వేసవిలో సైతం నిండుకుండను తలపిస్తున్నాయి. దానికి తోడు ప్రభుత్వ సాయంతో మత్స్యకారులు విరివిగా చేపలు పెంచుతున్నారు. కాళేశ్వరం ఆయకట్టు పరిధిలోని తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లోని 10 మండలాల మత్స్యకారుల ఆదాయం ఏడేండ్ల క్రితం వరకు రూ.15కోట్లు ఉంటే ప్రస్తుతం అది రూ.114కోట్లకు చేరడం విశేషం.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగింది చేపల పెంపకమే. దాన్ని ప్రోత్సహించి మత్స కార్మికులకు ఉపాధి కల్పించాలని కేసీఆర్ సర్కారు భావించింది. దానిలో భాగంగా మునుపెన్నడూ లేని విధంగా మత్స సహకార సంఘాలకు చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసింది. దీంతో చేపల పెంపకం గణనీయంగా పెరిగింది.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తుంగతుర్తి, తిరుమలగిరి, నాగారం, అర్వపల్లి, మద్దిరాల, నూతనకల్ మండలాలతో పాటు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల, ఆత్మకూర్.ఎస్, పెన్పహాడ్, కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె మండలాలు శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్నాయి. కాళేశ్వరం వచ్చేంత వరకు ఈ మండలాలు కరువుతో అల్లాడుతూ చేపలు తిందామంటే దొరుకని పరిస్థితి. కేసీఆర్ సర్కార్ వచ్చాక మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువులు పునరుద్ధరించారు.
శ్రీరాంసాగర్ రెండోదశ ద్వారా జిల్లాలోని ఈ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాలకు కాళేశ్వరం జలాలు రావడంతో చెరువులన్నీ నిండాయి. వ్యవసాయం పండుగలా మారింది. ప్రభుత్వమే ఉచితంగా కోట్లాది చేప పిల్లలు పంపిణీ చేయడంతో ప్రస్తుతం పుష్కలంగా చేపలు లభిస్తున్నాయి. స్థానిక అవసరాలకు పోగా ఇతర ప్రాంతాలకూ విక్రయిస్తున్నారు. గతంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే చేపలు కొని తినేవారు. ఇప్పుడా ఆ పరిస్థితి లేదు.
ఏడేండ్ల క్రితం వరకు జిల్లాలోని 10 మండలాలు కరువుతో అల్లాడేవి. 278 చెరువులకు గానూ 15శాతం చెరువుల్లో మాత్రమే ఓ స్థాయిలో నీరు ఉండేది. మరో పదిశాతం చెరువుల్లో కొద్దిపాటి నీరు ఉండడంతో మత్స్య కార్మిక సొసైటీల ఆధ్వర్యంలో చేపలు పెంచేది. ఇందుకోసం సుమారు 35 లక్షల చేప పిల్లలను సొంతంగా కొని చెరువుల్లో పోసేవారు. వాటి ద్వారా ఏటా దాదాపు 15కోట్ల రూపాయల మత్స్య సంపద చేతికి వచ్చేది. ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
మొత్తం 278 చెరువుల్లో కాళేశ్వరం జలాలు ఉండడంతో మూడేం డ్ల నుంచి రూ.2.5కోట్లకు పైనే చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా చెరువుల్లో పంపిణీ చేసింది. పెంచిన చేపలను మత్స్య సహకార సొసైటీలు విక్రయించగా ఏటా రూ.114కోట్లకుపైనే ఆదాయం మత్స్య కార్మికుల చేతికి వస్తున్నది. ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని చెరువుల్లో పెరిగే కట్ల, రాహు, మెరిగల చేపల ధర మార్కెట్లో కిలో సరాసరి రూ.120 పలుకుతుందని మత్స్య కార్మికులు చెబుతున్నారు. చెరువుల్లో వేసే చేప పిల్లలు దాదాపు 50శాతం వేస్టేజీ కింద పోగా మిగిలిన చేపలను విక్రయిస్తుంటారు. కాళేశ్వరం ఆయకట్టు పరిధిలో ఐదేండ్లలో ఏటేటా మత్స్య సంపద పెరుగుతున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మత్స్యకారులు సైతం చేపలు కొనుక్కొని తినాల్సిన పరిస్థితి ఉండేది. వర్షాకాలంలోనూ చెరువుల్లో చుక్క నీరు ఉండేది కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కార్ మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువులు పూడిక తీసి బాగు చేసింది. కాళేశ్వరం జలాలతో వాటిని నింపి మత్స్యకారులకు జీవనోనోపాధి కల్పించింది. ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా చేపలే. ప్రతి రోజూ వస్తున్న చేపలను స్థానికంగా, ఇతర ప్రాంతాలకు అమ్మి ఆర్థికంగా ఎదుగుతున్నాం.
-జంగా వెంకటేశ్వర్లు, నెమ్మికల్, మత్స్యకారుడు