నల్లగొండ, డిసెంబర్ 4 : ‘రాష్ట్రంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, పేద విద్యార్థులను వైద్యులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో నల్లగొండలో మెడికల్ కళాశాల, రైతులకు సాగు నీరు ఇవ్వాలని ఎస్సెల్బీసీ కింద చేపట్టిన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులకు బీఆర్ఎస్ హయాంలోనే నిధులు ఇచ్చి పనులు చేశాం. మా ప్రాజెక్టులు ప్రారంభించడానికి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి మీ పాలనలో నల్లగొండకు ఏం ఇస్తారో చెప్పాలి’ అని నల్లగొండ జడ్పీ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ నెల 7న సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండకు వస్తున్న నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో రూ.1,350కోట్లు తీసుకొచ్చి నల్లగొండ నియోజక వర్గం రూపురేఖలే మార్చామన్నారు. ప్రధానంగా రోడ్ల విస్తరణ, మెడికల్ కళాశాల, ఐటీ హబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దామరచర్ల మండలంల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, నకిరేకల్‌లో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తి చేశామని, కేవలం వాటి ప్రారంభించడం కాకుండా నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఏం నిదులు ఇస్తారో చెప్పాలన్నారు.
నల్లగొండలో రూ.250కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించడంతోపాటు పట్టణంలోని వార్డుల అబివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తాను రూ.234కోట్లతో రూపకల్పన చేసిన ప్రాజెక్టులైన ఉదయ సముద్రం, పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాల అభివృద్ధి, శిల్పారామం, మాస్టర్ ప్లాన్ కోసం ఉద్దేశించిన నిధులను డైవర్ట్ చేయకుండా వాటిని యధావిథిగా అభివృద్ధి చేయాలని కోరారు. బ్రాహ్మణ వెల్లంలకు నీటి కేటాయింపులు లేవని, రూ.35కోట్ల కమీషన్‌కు కక్కుర్తి పడ్డ కోమటిరెడ్డి ఈ ప్రాజెక్టు తీసుకొచ్చారని ఆరోపించారు. దాని ఉద్దేశం నెరవేరాలంటే ఎస్సెల్బీసీకి మరో రూ.1,500కోట్లు వెచ్చించి నాలుగు వేల క్యూసెక్కుల సామర్ధ్యంతో కాల్వల లైనింగ్ చేపట్టాలన్నారు. నల్లగొండలో నిర్వీర్యం చేసిన ఐటీ హబ్‌కు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. మూసీ పా పం కాంగ్రెస్‌ది అయితే ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసి సాగు నీరు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాది కాలంలోనే ప్రజలు తిరగబడ్డారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
సాధించిందే లేనప్పుడు విజయోత్సవాలు ఎందుకు? : బండ
ఏడాది కాలంలోనే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ అసలు సాధించిందే లేనప్పుడు విజయోత్సవాలు ఎందుకని, ప్రజా ధనం దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారని నల్లగొండ మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటి వరకూ ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకపోవటంతోపాటు ఇక్కడ సంపదను దోచి ఢిల్లీ పెద్దలకు రేవంత్ సర్కార్ కప్పం కడుతున్నదని ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచే డబ్బు వెళ్లే పరిస్థితి ఉందన్న ఆయన మంత్రులు సైతం నిత్యం అవినీతి దిశలనే వెతుకుతున్నట్లు పేర్కొన్నారు. దేశానికి దిక్సూచిగా నిలిచిన గురుకులాలను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించి పిల్లలకు కనీసం మంచి భోజనం కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశౄరు. 55వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పడం కాదని, అందులో 12వేలు మినహాయిస్తే మిగిలినవన్నీ బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్లు వేసిన విషయాన్ని మర్చిపోవద్దని గుర్తుచేశారు.
కేసీఆర్ ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కోకో కోలా ప్రాజెక్టును ప్రారంభించటం, నాణ్యమైన కరెంట్ ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బంది పడడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ నెల 7న నల్లగొండకు చేపట్టడానికి వస్తున్న సీఎంకు వివిధ అభివృద్ధి పనుల డిమాండ్లలతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున కదిలివెళ్లి వినతి పత్రం ఇవ్వనున్నట్లు బండ, కంచర్ల తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కటికం సత్తయ్య గౌడ్, బొర్ర సుధాకర్, అభిమన్యు శ్రీనివాస్, కరీం పాష, నారబోయిన భిక్షం, లొడంగి గోవర్ధన్, వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, దేప వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య, మారగోని గణేశ్, యుగంధర్‌రెడ్డి, రంజిత్, రావుల శ్రీనివాస రెడ్డి, మెరుగు గోపీనాథ్ పాల్గొన్నారు.