సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 6 : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మన వివాహ వ్యవస్థ చాలా గొప్పదని, మన కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యం ప్రపంచ దేశాలకు తెలిసిందని పేర్కొన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వేదాంత భజన మందిరంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో జగదీశ్‌రెడ్డి దంపతులు పాల్గొని పట్టువస్ర్తాలు, తలంబ్రాలను సమర్పించారు.
అనంతరం శ్రీరామ్‌నగర్‌లోని విజయాంజనేయస్వామి దేవాలయంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ మానవ జాతిని ముందుకు నడపడంలో వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఎంతో ముఖ్యమైనవన్నారు. అలాంటి పవిత్రమైన వివాహ బంధాన్ని చెప్పాలంటే సీతారాముల కల్యాణంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వేలాది సంవత్సరాలుగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తూ మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం చాలా గొప్ప విషయమని చెప్పుకొచ్చారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లావాప్యంగానూ శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అభిజిత్ లగ్నం శుభ ముహూర్తాన ఊరూవాడ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిపించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వేడుకల్లో పాల్గొన్నారు.