నీలగిరి, ఏప్రిల్ 30 : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, రైతులను పట్టించుకునే వారే కరువయ్యారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి విమర్శించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, దవాఖానలో చికిత్స పొందుతున్న ఐకేపీ కేంద్రం నిర్వాహకుడు సైదులును గురువారం భూపాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సైదులు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా రైతులను ఇబ్బందులు పెడుతోందన్నారు. సెంటర్లకు ధాన్యం తెచ్చి నెల రోజులు దాటుతున్నా కొనే దికేలేదని అవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు మాయ మాటలు చెప్పి, ఇప్పడు వాటిని అమలు చేయకుండా ఇబ్బందులు పెడుతోందన్నారు. ధాన్యం.. కేంద్రాలకు వచ్చి పది రోజులు దాటినా కొనుగోళ్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయన్నారు.
ఇప్పటి వరకు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సెంటర్లలో ఉన్నా, కేవలం పది నుంచి 20 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే ఇవ్వాల్సిన ట్రక్ షీట్ వారం, పది రోజుల తర్వాత ఇస్తున్నారన్నారు. వారం రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పి, నెల రోజులు దాటినా డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో కలెక్టర్ ఆదేశాల పేరుతో రెండు నుంచి మూడు కేజీల ధాన్యాన్ని కటింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లు బీ గ్రేడ్ పేరుతో డబ్బులు తకువ ఇస్తున్నారని, దీనికి తోడు అనేక కొర్రీలు పెడుతుండటంతో రైతులు, మిల్లర్లకు మధ్య నిర్వాహకులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట కార్పొరేటర్లు మారగోని భవానీ గణేష్, దీప్లా నాయక్, దోటి శ్రీను ఉన్నారు.