రామగిరి, ఫిబ్రవరి 11 : ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివే విద్యార్థులకు సర్కార్, రాష్ట్ర విద్యాశాఖ శుభవార్త ప్రకటించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో(జడ్పీ, మోడల్ స్కూల్స్) పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల దృష్టిలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఖాళీ కడుపుతో చాలామంది విద్యార్థులు వస్తున్నట్లుగా గుర్తించిన సర్కార్ వారి కడుపు నింపేలా స్నాక్స్ అందించే ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించిన బడ్జెట్ను డీఈఓలకు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఐఏఎస్ ఎ.దేవసేన ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 595పాఠశాలల్లోని 15,958మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది.
15నుంచి స్నాక్స్ అందించేలా చర్యలు
ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ నెల 15నుంచి ఏప్రిల్ 1, 2023వరకు(34రోజులు) ప్రతి నిత్యం స్నాక్స్ అందించనున్నారు. ప్రతి విద్యార్థికీ రోజుకు రూ.15చొప్పున ఖర్చు చేయనుంది. వీరికి సంబంధించిన బడ్జెట్ను డీఈఓలకు మంజూరు చేసినట్లు రాష్ట్ర విద్యా శాఖాధికారులు వెల్లడించారు.