రామగిరి, మే 7 : వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరిచే సమయానికే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ్య ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు పుస్తకాలు జిల్లా బుక్ డిపోకు రాగా వాటిని ఆయా మండల విద్యాధికారి కార్యాలయాలు పంపించే ప్రక్రియను బుధవారం ప్రారంభించారు. నల్లగొండ జిల్లాలోని 32 మండలాల్లో 1,637 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, గురుకుల, మోడల్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు 1,43,982 మంది ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందిస్తుంది. వీరికి 5,89,970 పుస్తకాలు అవసరం కాగా ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని బుక్ డిపోకు 3,67,940 పుస్తకాలు చేరాయి. మిగతావి త్వరలో వస్తాయని బుక్డిపో మేనేజర్ వెంకటాచారి తెలిపారు. జూన్ 1న బడిబాటతో పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.
జిల్లా కేంద్రంలోని బుక్డిపోకు చేరిన పాఠ్య పుస్తకాలను ఎంఈఓలు పెట్టిన ఇండెంట్ మేరకు అందజేస్తాం. బుధవారం పుస్తకాల పంపిణీని ప్రారంభించి తిప్పర్తి, నల్లగొండ మండలాలతోపాటు బీసీ గురుకులాల పాఠశాలలకు పంపించాం. పాఠశాలలు పునః ప్రారంభం నాటికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎంఈఓలు జిల్లా బుక్డిపో నుంచి తమ కార్యాలయాలకు వచ్చిన పుస్తకాలను పాఠశాలలకు పంపించాలి.