నీలగిరి, జూన్ 30 : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన మన అందరి బాధ్యత అని, బాలలకు స్వేచ్ఛ, వికాసం కల్పించాలని ఎస్పీ అపూర్వరావు ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఆపరేషన్ ముస్కాన్-9కు సంబంధించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యూకేషన్ డిపార్ట్మెంట్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అధికారులతో పోలీసు కార్యాలయంలో శుక్రవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిరాదరణకు గురైన, తప్పిపోయిన, వెట్టి చాకిరీకి గురవుతున్న బాలబాలికలను గుర్తించి వారిని సంరక్షించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేడు (శనివారం) నుంచి నెల రోజుల పాటు ఆపరేషన్ ముస్కాన్-9 నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మూడు సబ్ డివిజన్లలో పోలీస్, లేబర్, చైల్డ్ కేర్, రెవెన్యూ, హెల్త్, ఐసీడీఎస్, శిశు సంక్షేమ అధికారులు సమన్వయంతో బృందాలుగా ఏర్పడి తప్పిపోయిన బాలబాలికలను గుర్తించడం, పరిశ్రమలు, బ్రిక్స్ తయారీ, హోటల్స్, లాడ్జి, మినరల్ వాటర్ సప్లయ్, దుకాణాలు, దాబాలు..ఇలా ఎక్కడైనా పిల్లలు వెట్టిచాకిరీకి గురైతే అలాంటి వారిని గుర్తించి సంబంధిత దుకాణాలపై కేసులు న మోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. నిరాదరణకు గురైన, తప్పిపోయిన పిల్లలు ఉన్నా, వెట్టి చాకిరీకి గురవుతున్న పిల్లలు ఉన్న పోలీసులకు, చైల్డ్ కేర్ వారికి సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. ఇలాంటి పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించడం లేదా స్టేట్ హోమ్‌కు పంపించనున్నట్లు తెలిపారు. ఎక్కడైనా బాలకార్మికులను చూసినప్పుడు 1098 లేదా డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో డీడబ్ల్యూఓ కృష్ణవేణి, డీసీపీఓ గణేశ్, సీడబ్ల్యూసీ చైర్మన్ కృష్ణ, నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ లేబర్ ఆఫీసర్స్, చైల్డ్ లైన్ ఆఫీసర్ ఆంజనేయులు, ఏహెచ్‌టీయూ ఎస్ఐ గోపాల్‌రావు, మిగతా టీం సభ్యులు పాల్గొన్నారు.