గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటుచేసిన సెగ్రిగేషన్ షెడ్లు ఆదాయం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్ ట్రాలీతో ఇంటింటికీ వెళ్లి సేకరించిన తడి, పొడి చెత్త గ్రామపంచాయతీలు వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నాయి. ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఏపూరు గ్రామ పంచాయతీలో ఏడాది నుంచి ఈ ప్రక్రియను విజయవంతంగా సాగిస్తున్నది. చెత్త నుంచి తయారు చేసిన వర్మీ కంపోస్టును కొనుగోలు చేసి పొలాల్లో వేసుకునేందుకు గ్రామ రైతులే ముందుకు వస్తుండగా, తక్కువ ధరకే అందిస్తున్నది. దాంతో గ్రామం స్వచ్ఛతకు కేరాఫ్‌గా నిలుస్తుండడంతోపాటు పంటల్లోనూ కొంత మేర రసాయన ఎరువుల నియంత్రణకు ఆస్కారం ఏర్పడుతున్నది.
ఇంటింటి నుంచి సేకరించిన చెత్తతో ఎరువు తయారు చేసి, విక్రయించడంతో పంచాయతీకి ఆదాయం సమకూరుతున్నది. మరోవైపు గ్రామంలో పరిశుభ్రత నెలకొనడంతోపాటు ఆహ్లాద వాతావరణం ఏర్పడుతున్నది. ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూరు గ్రామంలో విజయవంతంగా ఈ కార్యక్రమం అమలవుతుండడంతో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
పల్లె ప్రగతితో కొత్తరూపు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ప్రతినెలా పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుండడంతో ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. రోడ్లు, డ్రైనేజీలు, ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణంతోపాటు హరితహారం కార్యక్రమంలో విస్తృతంగా మొక్కలు నాటడంతో ప్రతి పల్లె పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. వీటికి తోడు గ్రామ పంచాయతీకి ఒక టాక్ట్రర్, ట్రాలీ, ట్యాంకర్ సమకూర్చడంతో మొక్కల సంరక్షణకు, చెత్త తరలింపునకు ఉపయోగపడుతున్నాయి. ఇంటింటి నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డ్‌కు తరలించడంలో పంచాయతీ ట్రాక్టర్లు కీలకపాత్ర వహిస్తున్నాయి. జిల్లాలోని 98శాతం పంచాయతీల్లో కంపోస్ట్ ఎరువు ఉత్పత్తి జరుగుతుండగా ఇందులో ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూరు జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నది. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏపూరును పలుసార్లు సందర్శించి కితాబిచ్చారు. మార్కెట్లో వర్మీ కంపోస్ట్ ఎరువులు వాడే పంటలకు డిమాండ్ ఉన్న విషయం విదితమే. ఏపూరులో వర్మీ కంపోస్టు ఎరువు తయారవుతుండడంతో ఇప్పుడిప్పుడే రైతులు కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు.
12 నెలలు.. 20 వేల ఆదాయం
ఏడాది కాలంలో ఏపూరు గ్రామంలో చెత్త నుంచి తయారు చేసిన ఎరువును విక్రయించడం ద్వారా పంచాయతీకి రూ.20 వేల ఆదాయం సమకూరింది. గ్రామంలోని పంచాయతీ కార్మికులు ట్రాక్టర్‌తో ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ షెడ్డుకు తరలించి తడి, పొడి చెత్తతోపాటు మొత్తం 8 రకాలుగా విభజిస్తారు. తడి చెత్త నుంచి వర్మీ కంపోస్ట్‌ను తయారు చేస్తున్నారు. ఈ ఎరువును గ్రామంలోని రైతులకే విక్రయిస్తున్నారు. వర్మీ కంపోస్ట్ మార్కెట్లో కిలోకు 20 రూపాయలపైనే ఉండగా గ్రామస్తులకు 15 రూపాయలకే విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 25 క్వింటాళ్ల ఎరువు తయారైంది. దాదాపు 13 క్వింటాళ్లు విక్రయించగా రూ.20 వేల ఆదాయం వచ్చింది. ఇక చెత్తలోని ప్లాస్టిక్, గాజు సీసాలు, పేపర్లను విక్రయించడం ద్వారా మరికొంత ఆదాయం సమకూరుతున్నది. కంపోస్ట్ ఎరువులో కొంత గ్రామంలోని నర్సరీకి, ఎవెన్యూ ప్లాంటేషన్‌కు వాడుతున్నారు.
కొనుగోలుకు ముందుకు వస్తున్నారు
ఏడాది నుంచి గ్రామంలో చెత్త నుంచి వర్మీ కంపోస్ట్‌ను తయారు చేస్తుండగా కొనుగోలు చేసేందుకు రైతులు ముందుకు రాలేదు. తొలుత గ్రామ సర్పంచ్ ఎరువును కొనుగోలు చేసి తన పంట పొలంలో వేయడం ప్రారంభించారు. అనంతరం ఒక్కొక్కరుగా కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో రసాయన ఎరువులు వేసిన పంటల కంటే వర్మీ కంపోస్ట్‌తో పండించే పంటలకు గిరాకీ ఉన్నది. రైతులు ఈ విషయం గుర్తించాలి.
– ఉమారాణి, పంచాయతీ సెక్రటరీ, ఏపూరు
వర్మీ కంపోస్ట్ వాడితే పంటకు తెగులు రాలే
గతంలో నేను ఎకరం పత్తి సాగు చేసిన. వేల రూపాయల మందులు తెచ్చి పిచికారీ చేసిన. అయినా ఆశించినంత దిగుబడి రాలే. గ్రామ పంచాయతీ ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారని తెలిసి తీసుకెళ్లిన. పంటలో వేసిన. పంటకు ఏ తెగులూ రాలే. మందులు కూడా పిచికారీ చేయలే. పంట దిగుబడి గతంలో కంటే ఎక్కువ వచ్చింది. వర్మీ కంపోస్ట్ ఎరువే మంచిదని ఇప్పుడు అదే వాడుతున్నా.
-గుండ్లపల్లి వెంకన్న, రైతు, ఏపూరు
తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి
నేను గతంలో రెండెకరాల్లో వరి సాగు చేయగా తెగులు రాకుండా ఉండేందుకు అనేక రకాల మందులు పిచికారీ చేసేది. అయినా ఏదో ఒక తెగులు వచ్చి పంట దిగుబడి తగ్గేది. గ్రామంలో తయారైన వర్మీ కంపోస్ట్ వేసిన తర్వాత భూసారం పెరిగింది. పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది. మందులు కూడా పిచికారీ చేయలేదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చింది. అప్పటి నుంచి వరి పొలానికి వర్మీ కంపోస్ట్ వాడుతున్నా.
– జలగం గోపాల్, రైతు, ఏపూరు