నిడమనూరు, ఆగస్టు 29 : బత్తాయి రైతుల సమస్యలకు తగు పరిష్కార మార్గాలను చూపి, గిట్టుబాట ధర అందించే దిశగా ప్రయత్నం చేస్తామని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిటీ సభ్యుల బృందం నల్లగొండ జిల్లాలోని మల్లేపల్లిలో గల ఉద్యాన పరిశోధన స్థానంను సందర్శించారు. అనంతరం నిడమనూరు మండలం గుంటిపల్లి, ఎర్రబెల్లి గ్రామాల్లో గల బత్తాయి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బత్తాయి సాగులో గల సమస్యలను రైతులు చైర్మన్కు వివరించారు. నాణ్యమైన బత్తాయి మొక్కలు లభించక పోవడం, బత్తాయి తోటలకు బిందు సేద్య పరికరాలు రాయితీలో అందివ్వక పోవడం, బత్తాయి తోటల్లో వడపూ (కాయ రాలుట), మంగు, పల్లాకు, వేరు కుళ్లు తెగులు వంటి చీడ పీడలు, తెగుళ్లు ఉన్నాయని, ఎన్ని రకాల క్రిమి సంహారక మందులు పిచికారీ చేసినా నివారించలేకపోతున్నామని, బత్తాయికి మార్కెటింగ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల దళారీలను ఆశ్రయించి నష్ట పోతున్నట్లు, తిరుపతి చీనీ, నిమ్మ పరిశోధన స్థానం నుండి తెచ్చుకున్న మొక్కలు నాణ్యంగా లేవని, కాయ పరిమాణం రాకముందే రాలిపోతున్నాయని, మొక్కలను పరిశీలించి, పరీక్ష చేసి తగిన నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు.
సమస్యలన్నింటినీ సావధానంగా విన్న రైతు కమిషన్ చైర్మన్ స్పందిస్తూ శనివారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. బత్తాయి రైతుల సమస్యలకు తగు పరిష్కార మార్గాలను చూపి, గిట్టుబాట ధర అందించే దిశలో ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ బాబు, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సుభాషిణి, తాసీల్దార్ కృష్ణయ్య, వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు సరిత, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం, వైస్ చైర్మన్ బుసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ అధికారి ముని కృష్ణయ్య, ఉద్యాన అధికారులు అనంత రెడ్డి, మురళి, రిషిత, శ్వేత, విద్యా సాగర్, నసీమా గ్రామ రైతులు పాల్గొన్నారు.
Nidamanoor : బత్తాయి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి : కోదండ రెడ్డి