సూర్యాపేట, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : పరీక్షలు సొంతంగా నిర్వహించడం, ప్రశ్నాపత్రాలు సొంతంగా తయారు చేయడం, వాల్యూవేషన్ కూడా వారే చేయడం అనేది ఇంజినీరింగ్ కళాశాలకు కల్పించే స్వయం ప్రతిపత్తి. అలాంటి అటానమస్ హోదా కోసం పలు కాలేజీలు అడ్డదారులు వెతుకుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో దాదాపు పాతికకుపైగా ఇంజినీరింగ్ కళాశాలు ఉండగా, ఐదారు కాలేజీల యాజమాన్యాలు అటానమస్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకోసం కోటి రూపాయులు పెట్టేందుకైనా వెనుకాడడం లేదని విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ఇంజినీరింగ్ అనేది వృత్తి విద్యా కోర్సు అయినందున భవిష్యత్లో స్థిరపడాలంటే కచ్చితంగా సబ్జెక్టుపై పట్టు ఉండాలి. ప్రైమరీ, పది, ఇంటర్మీడియట్ పరీక్షల మాదిరి దీన్ని చూస్తే భవిష్యత్లో స్థిరపడడానికి అవకాశం ఉండదనేది విద్యావేత్తల మాట.
యూనివర్సిటీల పరిధిలో ఉండే కళాశాలలు, అటానమస్ రెండు రకాలుగా ఉంటాయి. జేఎన్టీయూ వంటి యూనివర్సిటీల పరిధిలో ఉండే కళాశాలలకు పరీక్షా పేపర్లు తయారీ, వాల్యుయేషన్ వంటి అంశాలు యూనివర్సిటీ పరిధిలోనే ఉంటుండగా, అటానమస్ పర్మిషన్ ఉన్న కళాశాలలకు అన్నీ వారే చేసుకునే అవకాశం ఉంది. కళాశాలల్లో ఉండే సగం కోర్సులకు నేషనల్ బోర్డ్ అక్రిడేషన్(ఎన్బీఏ) ఉండడం లేదా న్యాక్ అక్రిడేషన్ పొందడం ద్వారా అటానమస్ వస్తుంది.
ఎన్బీఏ అక్రిడేషన్ పొందాలంటే సునిశిత పరిశీలన ఉంటుంది. అక్కడ ఎటువంటి పైరవీలు, దొడ్డి దారికి ఆస్కారం ఉండదు. కానీ న్యాక్ అక్రిడేషన్ పొందేందుకు మాత్రం అడ్డదారిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రముఖ యూనివర్సిటీ అటానమస్ పొందడానికి ముందు న్యాక్ కోసం లక్షల రూపాయలు లంచం ఇవ్వడం, సీబీఐ విచారణ, న్యాక్ బృందంపై దాడులు చేసి కేసులు నమోదు చేయడం తెలిసిందే.
ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని పలు కళాశాలల యాజమాన్యాలు అడ్డదారిన అటానమస్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అటానమస్ పేరు చెప్పి పాస్ గ్యారెంటీతోపాటు మంచి మార్కులు వస్తాయని ఎరగా చూపించి అడ్మిషన్లు చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇంజినీరింగ్లో చేరే విద్యార్థులు అటానమస్ చూడకుండా వసతులు, అధ్యాపక బృందం, బోధన ఎలా ఉన్నాయో చూసుకోవాలని, సీనియర్ విద్యార్థులతో మాట్లాడితే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని సూచిస్తున్నారు.
విద్యార్థుల భవిష్యత్తో ఆడుకోవడమే..
ఇంజినీరింగ్ కళాశాలల్లో సరిపడా వసతులు, బోధన లేకున్నా అటానమస్ కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేసి దొడ్డిదారిన తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తో ఆడుకోవడమే అవుతుంది. ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేసి సరైన స్కిల్స్ లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థుల తల్లిదండ్రులు అన్ని ఆరాలు తీసి పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం మంచి కళాశాలలను ఎంచుకోవాలి. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై ఉద్యమాలు చేస్తాం.
-ధనియాకుల శ్రీకాంత్వర్మ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు