రామగిరి, డిసెంబర్ 30 : విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర సాంకేతిక (విజ్ఞాన, గణితశాస్త్ర) నైపుణ్యాలను వెలికితీసి వారి ప్రతిభకు పదునుపెట్టే జిల్లా స్థాయి సైన్స్ ప్రాజెక్టులు, ఇన్స్పైర్ మానక్ అవార్డు ప్రదర్శనలు ఈ విద్యా సంవత్సరం ఆన్లైన్లో నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ప్రదర్శనలు ఆన్లైన్లో చేసేందుకు అవసరమైన అంశాలను సన్నద్ధం చేసేలా జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. సమాజం కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ప్రధాన అంశంతోపాటు ఇన్స్పైర్ మానక్ అవార్డులు (2022-23)కు ఎంపికైన 143 ప్రాజెక్టుల ప్రదర్శన ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రదర్శనకు సూచించిన అంశాల్లో వర్కింగ్ మోడల్స్‌కు ప్రాధాన్యం కల్పించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శన వీడియో పంపించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి ప్రదర్శనలో ఎంపికైన ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి పంపిస్తారు.
ప్రదర్శనలో పాల్గొనే పాఠశాలలు, విద్యార్థులు, ఛాత్రోపాధ్యాయుల వివరాలను జనవరి 8లోగా జిల్లా విద్యాశాఖ జారీ చేసే గూగుల్ ఫారం లింక్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల తయారీలో ఆయా విద్యాసంస్థల గణిత, సైన్స్ ఉపాధ్యాయులు గైడ్ టీచర్లుగా విద్యార్థులను ప్రోత్సహించి సంసిద్ధం చేసేలా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా ఇన్స్పైర్ అవార్డులు (2022-23)కు ఎంపికైన 143 ప్రాజెక్టుల వివరాలను e-DLEPCలో జనవరి 18లోగా ప్రాజెక్టు ప్రదర్శన వీడియో, ఇతర వివరాలను ఇన్స్పైర్ మానక్ కాంపిటేషన్ యాప్‌లో నమోదు చేయాలి. వీరికి జనవరి 19 నుంచి 25 వరకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జూమ్ ద్వారా జిల్లాల వారీగా ప్రదర్శన నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతిని గానీ, 9848578845లో గానీ సంప్రదించవచ్చు.